నిజాం పాలనలో ఉన్న మంత్రులంతా హిందువులే- హోం మంత్రి

by  |
nijam
X

దిశ, చార్మినార్​: అసఫ్ జాహీ పాలకులు అందించిన సేవలు, వారి సెక్యులర్ భావాలను భవిష్యత్​ తరాలకు తెలియజేయడానికి కృషిచేయాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మీడియా ప్లస్ ఆడిటోరియంలో ‘ఏక్ షామ్ షౌకత్ ఉస్మానియ కే నామ్’ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ రహీముద్దీన్ అన్సారీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. నిజామ్ మనుమడు నవాబ్ మీర్ నజఫ్ అలీ ఖాన్, గవా పత్రిక ఎడిటర్ ఫాజిల్ హుస్సేన్ పర్వేజ్, గుల్ బోటే ఎడిటర్ ముంబై ఫారూక్ సయ్యద్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ డాక్టర్ ముహమ్మద్ గౌస్, తామీరె మిల్లత్ అధ్యక్షులు జియావుద్దీన్ నయ్యర్ పాల్గొన్నారు.

మొదటి నిజాం మొదలుకొని ఏడో నిజాం పాలన వరకు ప్రధానమంత్రులు, ఇతర ఉన్నతాధికారులంతా హిందువులేనని, ఇది వారి లౌకికత్వానికి, మతసామరస్య స్ఫూర్తికి నిదర్శనమని హోమ్ మంత్రి అన్నారు. నిజాం పాలకులు హిందూ- ముస్లిములను రెండు కళ్లలా భావించారని, అన్ని మతాలను గౌరవించే వారని హోమ్ మంత్రి అన్నారు. అన్ని మతాల ఆరాధనాలయాలకు కానుకలు, జాగీర్లు ఇచ్చేవారని గుర్తుచేశారు. నిజాం ప్రభువు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైనప్పటికీ అత్యంత నిరాడంబర జీవితం గడిపిన దూరదృష్టిగల రాజు అని మంత్రి కొనియాడారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, శాంతినికేతన్, పాలస్తీన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లకు ఆర్థిక చేయూతనందించేవారని వివరించారు.

షౌకతె ఉస్మానియా గ్రంథాన్ని ముద్రించిన ఉర్దూ అకాడమీ నిర్వాహకులకు మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్రంథంలో 30 మంది రచయితలు తమ రచనలు చేశారని అన్నారు. ఖాలిద్ షహ్ బాజ్ రూపొందించిన డాక్యుమెంటరీ పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ డాక్యుమెంటరీలో ఆసిఫ్ జాహీ పాలకుల సేవలను కొనియాడారు. డాక్టర్ రహీముద్దీన్ అన్సారీ మాట్లాడుతూ రెండుసార్లు ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేసి ఎన్నో పుస్తకాలు ప్రచురించినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని రహీముద్దీన్ అన్సారీ అన్నారు. ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సెక్రటరీ ముహమ్మద్ గౌస్ ఉర్దూ అకాడమీ ప్రచురించిన పుస్తకాలను పరిచయం చేశారు. ఈ సమావేశంలో తస్నీమ్ జౌహర్, డాక్టర్ గౌసియా బేగమ్, డాక్టర్ నిషాత్ ఆలమ్, డాక్టర్ ఫాజిల్ హుసైన్ పర్వేజ్, ప్రొఫెసర్ ఫజలుల్లా ముక్రమ్, అసత్ సనాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed