ఐపీఎల్‌లో తొలి అమెరికన్ క్రికెటర్

by Shyam |
ఐపీఎల్‌లో తొలి అమెరికన్ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడనున్న తొలి అమెరికన్ క్రికెటర్‌గా అలీ ఖాన్ రికార్డు సృష్టించనున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీల తరఫున ఆడారు. అయితే అమెరికన్ ఆటగాడు ఆడటం మాత్రం ఇదే తొలిసారి. 29 ఏళ్ల ఈ పేసర్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడనున్నట్లు ఈఎస్‌పీఎన్-క్రిక్ఇన్ఫో (ESPNcricinfo) ఒక కథనంలో పేర్కొంది.

భుజం గాయం కారణంగా కేకేఆర్ (Kolkata Knight Riders) జట్టు నుంచి పేసర్ హ్యారీ గార్నీ వైదొలగడంతో అతడి స్థానంలో అలీ ఖాన్‌ను తీసుకున్నారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ (CPL)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (Trinbago Knight Riders) తరఫున ఆడుతున్న అలీఖాన్ ఇక కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. 2018లో గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడిన అలీఖాన్‌ బౌలింగ్‌ను గమనించిన డ్వేన్ బ్రావో అతడిని సీపీఎల్‌లో ఆడేలా చేశాడు. ఆ ఏడాది గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడిన అలీఖాన్ 12 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ ఏడాది ట్రిన్‌బాగో జట్టు తరపున ఆడి 8 వికెట్లు తీశాడు. సీపీఎల్ ముగించుకొని ఐపీఎల్ కోసం బయలుదేరిన డ్వేన్ బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘నెక్ట్స్ స్టాప్ దుబాయ్’ అనే క్యాప్షన్‌తో ఒక ఫొటో పెట్టాడు. దాంట్లో కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో పాటు అలీఖాన్ ఉన్నాడు. కాగా ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నందుకు అలీఖాన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ మెగా లీగ్‌లో ఏకైక యూఎస్ఏ ఆటగాడిగా ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నాను, నా కల నిజమైంది అని అలీఖాన్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed