బకాయి చెల్లించిన ఎయిర్‌టెల్!

by Harish |
బకాయి చెల్లించిన ఎయిర్‌టెల్!
X

అత్యున్నత న్యాయస్థానం తీర్పు, టెలికాం శాఖ ఆదేశాల నేపథ్యంలో దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ రూ. 10వేల కోట్ల బకాయిలు చెల్లించినట్టు ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ హెక్సాకామ్‌, టెలినార్‌ తరఫున సోమవారం రూ.10వేల కోట్లను టెలికాం శాఖకు చెల్లించామని, ప్రస్తుతం మేం బకాయిలపై స్వయం మదింపు ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నామని సంస్థ తెలిపింది. ఈ ప్రక్రియ అనంతరం సుప్రీంకోర్టు తదుపరి విచారణలోగా మిగిలిన మొత్తాన్ని చెల్లించనున్నట్టు ఎయిర్‌టెల్‌ వివరించింది. ఎయిర్‌టెల్ కంపెనీ.. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీల కింద మొత్తం రూ. 35,586 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఇతర టెలికాం కంపెనీలపై గతవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గతంలో రూ. 1.47 లక్షల కోట్లను చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయా సంస్థలు ఉత్తర్వులను పాటించలేదని న్యాయస్థానం మందలించింది. పైగా టెలికాం సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ టెలికాం విభాగంలోని ఓ డెస్క్‌ అధికారి ఆదేశాలు ఇవ్వడంపైనా అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. గతవారం కోర్టు ఆగ్రహించడంతో టెలికాం కంపెనీలు దిద్దుబాటు చర్యలను చేపట్టాయి.

Advertisement

Next Story