ఆరు సార్లు ఓడినా మళ్లీ హుజురాబాద్‌లో పోటీ.. తగ్గేదే లేదు అంటున్న ఆ అభ్యర్థి

by Shyam |   ( Updated:2021-10-16 09:18:05.0  )
ఆరు సార్లు ఓడినా మళ్లీ హుజురాబాద్‌లో పోటీ.. తగ్గేదే లేదు అంటున్న ఆ అభ్యర్థి
X

దిశ,తుంగతుర్తి: అవినీతి రహిత పాలన, పారదర్శకత, బాధ్యతాయుతమైన రాజకీయాలు, ఎన్నెన్నో ప్రజా సంక్షేమ పథకాల అమలు. ఎన్నెన్నో రావాలి. చివరికి ప్రజల విధానం మారాలి. అనే కసి, పట్టుదల, వీటి సాధన కోసం ఏనాటికైనా విజయాల పరంపర తన వెంట వస్తుందనే ఆశలు. వెరసి గత 4 సంవత్సరాలు గా ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా అందుకు ముందుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు లింగడి వెంకటేశ్వర్లు. మొన్నటి వరకు 6మార్లు వివిధ రకాల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఆయన నేడు హుజురాబాద్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో 7వ మారు తాను స్థాపించుకున్న ప్రజా వాణి పార్టీ తరఫున పోటీకి దిగుతున్నారు.

ఈ మేరకు నామినేషన్ వేసి రంగంలో ఉన్న ఆయన ఈ నెల 18 నుండి విచిత్ర తరహాలో ప్రచార పర్వంలోకి దూకుతున్నారు. ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థులు తాము ఇచ్చిన హామీలను కేవలం మాట ద్వారానే వ్యక్తిగతంగా లేదా వివిధ సమావేశాలలో చెప్పడం వరకు మనం చూస్తున్నాం. కానీ వెంకటేశ్వర్లు మాత్రం ఇప్పటికే 50 రూపాయల నోటరీ బాండుపై 13 రకాల హామీలను ప్రింట్ చేసి వాటిని ఖచ్చితంగా అమలు చేస్తానంటూ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఊరు, వాడ, ప్రతి ఇల్లు తిరుగుతూ ఓటర్లకు పంచి పెడుతున్నారు.

తాను గెలిస్తే ప్రజల అభిమతానికి విరుద్ధంగా నడవనని, ఇతర పార్టీలోకి మారనని, అవినీతి లేని పాలన కొనసాగిస్తానని, కులంతో సంబంధం లేకుండా బీదల బంధు పేరుతో ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తానని, ఫీల్డ్ అసిస్టెంట్ల పునర్నియామకం, అవుట్ సోర్స్ ఉద్యోగులను విద్యార్హతలను బట్టి పర్మినెంట్ చేయడం, జర్నలిస్టులకు వేతనాలు, నిరుద్యోగ భృతి, తదితర ముఖ్యమైన అంశాలన్నీ తన అఫిడవిట్లో పొందుపరిచారు.

Advertisement

Next Story