డి‘టెన్షన్’ క్యాంప్

by Shamantha N |
డి‘టెన్షన్’ క్యాంప్
X

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్‌ల నుంచి శరణార్థులుగా దేశంలోకి వచ్చిన ముస్లిమేతరుల(హిందు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీ)కు పౌరసత్వం కల్పించే సీఏఏ, అక్రమ చొరబాటుదారులు కాదని నిరూపించుకునే ఎన్ఆర్‌సి ప్రక్రియలపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్నది. సీఏఏతో ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించి.. ఎన్ఆర్‌సితో కేవలం ముస్లింలనే డిటెన్షన్ క్యాంప్‌లకు తరలించే కుట్ర చేస్తున్నదని కేంద్రంపై ఆరోపణలు వచ్చాయి. అస్సాంలో ఎన్ఆర్‌సి ప్రక్రియ ముగిసిన తర్వాత.. దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సిని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించగానే.. ఇలాంటి భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. కాగా, భయపడేదేమీ లేదని ప్రధాని మోది భరోసా ముచ్చట్లు చెప్పుకొచ్చారు. దేశంలో ఒక్క డిటెన్షన్ క్యాంప్‌ కూడా లేదని అన్నారు. కానీ, కేవలం ఒక్క అస్సాంలోనే ఆరు డిటెన్షన్(ఇందులో ఒకటి పూర్తిగా మహిళల కోసమే ఏర్పాటు చేశారు) క్యాంపులున్నాయి. గోల్‌పరాలో దేశంలోనే అతిపెద్ద డిటెన్షన్ క్యాంప్(సుమారు మూడు వేల మందిని ఉంచొచ్చు) నిర్మాణానికి కేంద్రమే రూ. 46 కోట్ల నిధులు విడుదల చేయడం గమనార్హం. గతేడాది చివరినాటికే.. ఈ క్యాంప్ నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. గతేడాది నవంబర్ నాటికి అస్సాంలో ఆరు డిటెన్షన్ క్యాంపులు, అస్సాం బయట నాలుగు డిటెన్షన్ క్యాంపులు ఆపరేషనల్ స్థితిలో ఉన్నాయని హోం శాఖ వెల్లడించింది.

సీఏఏ, ఎన్ఆర్‌సి‌లకు ముస్లింలు, ఇతర అణగారిన వర్గాలు బలయ్యే ప్రమాదముందన్న ఆందోళనల నేపథ్యంలోనే కేంద్రం మరో షాక్ ఇచ్చింది. 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి శరణార్థులుగా వచ్చి డిటెన్షన్ క్యాంపుల్లోకి చేరిన ముస్లిమేతరులను విడుదల చేయాల్సిందిగా అస్సాం సర్కారుకు సూచనలు వెళ్లినట్టు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఆదేశాలనేమీ జారీ చేయలేదని అన్నారు. కేంద్రం.. మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత సీఏఏ కింద పౌరసత్వానికీ వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ నెల 4న లోక్‌సభలో తెలిపారు. అస్సాం ప్రభుత్వ వివరాల ప్రకారం.. గత మూడేళ్లలో 761 మంది విడుదలైనట్టు వివరించారు.

అస్సాంలో జైళ్లతో కలిపి నిర్వహిస్తున్న ఈ ఆరు డిటెన్షన్ సెంటర్‌లలో 988మందిని తరలించినట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో గతేడాది నవంబర్‌లో వెల్లడించారు. సాధారణంగా ఈ డిటెన్షన్ క్యాంప్‌లోపలి సంగతులు బయటికి వెల్లడికావు. అధికారులు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తుంటారు. కాగా, ఈ క్యాంపుల్లోని వసతులు దుర్భరంగా ఉంటాయని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. క్యాంపుల్లో డిటెయినీలు కుటుంబాలకు దూరంగా.. భవిష్యత్తుపై నిరాశజనక ఆలోచనలతో నైరాశ్యంలోకి జారిపోతుంటారని చెబుతున్నారు. క్యాంపుల్లో ఆత్మహత్య ఘటనలూ చోటుచేసుకున్నాయని వివరిస్తున్నారు. గత నవంబర్‌లో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. డిటెన్షన్ క్యాంపుల్లో 28 మంది మరణించారు. ఒక వైపు వైద్య సదుపాయాలన్నీ ఉన్నాయని చెబుతూనే.. అనారోగ్యంతో మరణించారని కేంద్రమంత్రి రాయ్ తెలిపారు. అలాగే, వారి మృతికి భయమో, ఒత్తిడో కారణం కాదని తెలిపే ప్రయత్నం చేశారు. కానీ, మానవ హక్కుల సంఘాలు మాత్రం ఇందుకు విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. డిటెన్షన్ సెంటర్‌లో మృతుల సంఖ్య సుమారు 100గా ఉంటుందని సిటిజన్స్ ఫర్ జస్టిస్ పీస్ అనే మానవ హక్కుల సంఘం వెల్లడించింది.

Advertisement

Next Story