‘నింగిని గెలిచిన నేల’ సంపుటి ఆవిష్కరణ

by Shyam |
‘నింగిని గెలిచిన నేల’ సంపుటి ఆవిష్కరణ
X

దిశ, క్రైమ్ బ్యూరో: రేపటి మహిళలైన నేటి బాలికలలో ఆత్మ విశ్వాసం, ధైర్యాన్ని నింపుకోవాల్సిన అవసరం ఉందని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా అన్నారు. మహిళలపై జరిగే హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా భద్రత, భరోసా, బాధ్యత అనే అంశంపై మహిళా భద్రత విభాగం, తెలుగు ఉమెన్ రైటర్స్ ఫోరం, అక్షరయాన్‌ సంస్థల సంయుక్త నిర్వహణలో బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కథా రచయితలు రచించిన ‘నింగిని గెలిచిన నేల’ అనే కథల సంపుటిని స్వాతి లక్రా ఆవిష్కరించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ… మహిళలకు బాధ్యతల మినహా భద్రత, భరోసా లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు సంపూర్ణమైన అండగా ఉండేందుకు మహిళా భద్రతా విభాగం కృషి చేస్తోందన్నారు. బాగా రాయగలిగిన వాళ్లకు, పాడ కలిగిన వాళ్లకు కళా రంగాల్లో బాలికలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బాలికలకు చట్టపరమైన, న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అతివ రక్షణ, ఆడ పిల్లల మీద వివక్షత అనే అంశంపై పాటల పోటీలు, కరోనా అంశంగా కవితల పోటీలను నిర్వహించారు.

అనంతరం డీఐజీ సుమతి మాట్లాడతూ… బాలిక విభాగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా భిన్నమైన కళారంగాలకు చెందిన అద్వైత నాయుడు, కర్రీ రేణిత, కృతివెంటి హేమలత, శ్రీచందన, హన్సీకలను ఎంపిక చేసినట్టు తెలిపారు. మహిళలు, పిల్లల సంరక్షణ, భద్రత, వికాసానికి రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. నింగిని గెలిచిన నేల కథల సంపుటిని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ సమీక్షించారు. సదస్సులో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ, వాణి దేవులపల్లి, రమాదేవి కులకర్ణీ, గురజాడ శోభ పేరిందేవి, సుజాత శేఖర్, సమ్మెట విజయ, యాకమ్మ, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story