వచ్చే ఏడాదికి ఇప్పుడే వసూళ్లు: అచ్యుతరావు

by Shyam |
వచ్చే ఏడాదికి ఇప్పుడే వసూళ్లు: అచ్యుతరావు
X

దిశ, హైదరాబాద్: యావత్తు ప్రపంచం కరోనా వైరస్ కారణంగా తల్లడిల్లుతుంటే.. ప్రయివేటు పాఠశాలలు మాత్రం ఫీజులను దండుకునే పనిలో పడ్డారు. కరోనా మరింత విస్తరించకుండా ఉండేందుకు విద్యా సంస్థలతో సహా దాదాపు అన్ని రంగాలు మూతపడుతుంటే ప్రయివేటు విద్యాలయాలు మాత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభం అయ్యే తరగతులు, వాటి ఫీజులు, పుస్తకాలు, నోటు పుస్తకాలకు అయ్యే ఖర్చులను ఇప్పట్నుంచే తల్లిదండ్రుల నుంచి లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అత్తాపూర్‎లోని యూరో కిడ్స్ ప్రి ప్రైమరీ పాఠశాల వచ్చే విద్యా సంవత్సరం పిల్లలకు పుస్తకాలు, యునిఫాం, బ్యాగ్‎లు, కిట్లు ఇవ్వడానికి కనీసం పదివేల రూపాయలు తమ బ్యాంకు ఖాతాలో ఈ నెల 23 వ తేదీ లోగా జమ చేయాలని ఆదేశించడం దారుణమని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు మండి పడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రమంతా పాఠశాలలకు సెలవులు ఇచ్చినా కొన్ని పాఠశాలలు మాత్రం తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో వెనక్కి వెళ్లడంలేదని విమర్శించారు. నెలాఖరులో ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలంటే మధ్య తరగతి ఉద్యోగులకు కఠిన పరీక్ష లాంటిదన్నారు. ప్రైవేటు పాఠశాలలు మాత్రం డబ్బు యావతో తల్లిదండ్రులను పీడించడం విద్యా హక్కుకు భంగకరమని అన్నారు. పాఠశాలలే.. పుస్తకాలు, దుస్తుల, చెప్పులు షాపులుగా మారడం దిగజారుడు తనానికి పరాకాష్ట అని అన్నారు. ఇలాంటి పాఠశాలల పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

Tag: Child Rights Association, Schools, Private Fees, Education

Advertisement

Next Story