జగన్ హెలికాప్టర్లలో కాదు రోడ్లపై తిరగండి..

by srinivas |
Acham-Naidu
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అడుగడునా గుంత.. ప్రయాణం చింత అన్నట్లుగా రాష్ట్రంలో దుస్థితి నెలకొందన్నారు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుబ్జూరులో రోడ్ల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మట్టిజల్లడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులకు కనీస రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉండటం సిగ్గుచేటని విమర్శించారు.

మట్టిజల్లిన కిరాయి మూకలను అరెస్టు చేయకుండా టీడీపీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని.. సుమారు 8 వేల కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రకటనలో తెలిపారు. రెండేళ్లుగా రోడ్లను వేయకపోగా పడిన గుంతల్లో తట్టమట్టి కూడా వేయలేని దిక్కుమాలిన ప్రభుత్వమని మండిపడ్డారు. రహదారులు సరిగా లేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. గిరిజన వాడల్లోని రహదారుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాష్ట్రంలో పర్యటిస్తే రోడ్ల దుస్థితితో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో జగన్ రెడ్డికి అర్థమవుతుందన్నారు.

గుంతల్లో రహదారి ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం పన్ను వసూలు చేస్తున్నప్పుడు వాటి బాగోగులు పట్టించుకోరా.? అని ప్రశ్నించారు. నియోజవకవర్గాల్లోని రోడ్లకు గుంతలు పూడ్చడానికి నిధులు అడిగే ధైర్యం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చేయడం లేదని మండిపడ్డారు. అవినీతి మీద ఉన్నశ్రద్ధ రోడ్లను బాగుచేయడంలో చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు. గర్భిణులను ఆసుపత్రికి తరలించాలంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని అచ్చెన్న చెప్పుకొచ్చారు.

రహదారులు బాగు చేసేంత వరకు వైసీపీని వదిలిపెట్టేది లేదన్నారు. తక్షణమే పాడైపోయిన రహదారుల స్థానాల్లో కొత్త రహదారులు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. దోచుకుని దాచుకోవడం మీదున్న శ్రద్ధ ప్రజలకు కల్పించే మౌళిక సదుపాయాలపై లేకపోతే ఎలా.? అని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు.

Advertisement

Next Story