రాహుల్‌కి కీపింగ్ ఇవ్వొద్దు: ఆకాశ్ చోప్రా

by Shyam |
రాహుల్‌కి కీపింగ్ ఇవ్వొద్దు: ఆకాశ్ చోప్రా
X

దిశ, స్పోర్ట్స్: టీ‌మ్ఇండియా రెగ్యులర్ కీపర్ ఎంఎస్ ధోనీ గత ఏడాది నుంచి జట్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో యాజమాన్యం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లను కీపర్లుగా కొనసాగిస్తున్నది. టెస్టులకు పంత్ కీపింగ్ చేస్తుండగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కేఎల్ రాహుల్ తాత్కాలిక కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాగా, అతడిని రెగ్యులర్ కీపర్‌గా వాడుకోవద్దని, అలా చేస్తే అతనిలో బ్యాటింగ్ సత్తా తగ్గిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా అదే అంటున్నాడు. కేఎల్ రాహుల్‌ను వన్డేల్లో తాత్కాలిక కీపర్‌గా కొనసాగించినా టెస్టుల్లో మాత్రం అతడిని కేవలం బ్యాట్స్‌మాన్‌గా మాత్రమే గుర్తించాలని చోప్రా అభిప్రాయపడుతున్నాడు. ‘టెస్టు క్రికెట్‌లో కీపింగ్ చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఒకసారి భారత జట్టు రెగ్యులర్ కీపర్ కిరణ్ మోరే ఇంగ్లాండ్‌తో మ్యాచ్ సమయంలో గ్రాహం గూచ్ క్యాచ్ వదిలేశాడు. అనంతరం గూచ్ 333 పరుగులు చేశాడు. టెస్టుల్లో రెగ్యులర్ కీపరే చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటే, ఇక తాత్కాలిక కీపర్ ఏం బాధ్యత నిర్వర్తించగలడు. ఇదొక ప్రత్యేమైన జాబ్. దీనికి కేఎల్ రాహుల్ సరికాడు’ అని చోప్రా అన్నాడు. టెస్టు క్రికెట్‌లో పంత్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అదే విధంగా వృద్ధిమాన్ సాహాకు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదని అన్నాడు.

Advertisement

Next Story