విరక్తి చెంది.. నిర్మానుష్య ప్రదేశంలో అలా చేసిన యువకుడు

by Sumithra |   ( Updated:2021-10-30 10:39:46.0  )
uri-12
X

దిశ, జల్ పల్లి: అదృశ్యమైన యువకుడు నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గత కొన్ని రోజుల క్రితం వచ్చిన బోన్ క్యాన్సర్ కారణంగానే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలాపూర్ ఇన్ స్పెక్టర్ బి. భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం సరూర్ నగర్ కు చెందిన శ్రీను (29) గత కొన్ని రోజులుగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబసభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన శ్రీను పహాడి షరీఫ్ లోని ఇజ్తేమా మైదానం కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story