ఓడిపోతామని బీఆర్ఎస్ ముందే గుర్తించిందా?.. అందుకే వారికి 6 సీట్లు ఇచ్చిందా?

by GSrikanth |
ఓడిపోతామని బీఆర్ఎస్ ముందే గుర్తించిందా?.. అందుకే వారికి 6 సీట్లు ఇచ్చిందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పవర్‌లో ఉన్నప్పుడు గులాబీ అధినేత కేసీఆర్ బీసీలను గుర్తించలేదు. దీంతో బీసీలంతా గుర్రుగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనైనా వారిని మచ్చిక చేసుకొని ఓట్లు సాధించేందుకు బీసీ అస్త్రం వాడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కేటాయించిన సీట్లకంటే అదనంగా సీట్లు కేటాయించారు. ఓడిపోతామనే భయంతోనే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారని పార్టీనేతలే అభిప్రాయపడుతున్నారు. సీట్లు ఇచ్చినా గెలువలేదని, అందుకే టికెట్లు కేటాయించడంలేదని భవిష్యత్‌లో ఆ నెపం వేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గెలిస్తే పార్టీ... ఓడితే బీసీలపై బద్నాం మోపాలని పార్టీ భావిస్తుందని విశ్వసనీయ సమాచారం.

బీసీలకు ఆరు టికెట్లు

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఉన్నవారికే, ఓసీ సామాజిక వర్గానికే పార్టీ పెద్దపీట వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూడటంతో బీసీల్లోని వ్యతిరేకతే కారణమని పార్టీ అధిష్టానం భావించింది. పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లోనూ బీసీలు గుర్రుగా ఉన్నారని తెలిసింది. వారికి అవకాశం కల్పిస్తేనే పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉంటాయని వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం. 17 ఎంపీ స్థానాల్లో 6 స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చారు.

గెలవలేరని తెలిసీ..

2019 లోక్‌సభ ఎన్నికలకంటే రెండు సీట్లు ఈసారి అదనంగా ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో బీసీలకు కేసీఆర్ పెద్దపీట వేశారని, ఆరు సీట్లు ఇచ్చారని బీఆర్‌‌ఎస్ నేతలు ప్రచారం షురూ చేశారు. ఈ ప్రచారంపై ఇతర పార్టీల నేతలతో పాటు, బీఆర్‌‌ఎస్‌లోని బీసీలు మండిపడుతున్నారు. పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్నప్పుడు బీసీలను లెక్క చేయని కేసీఆర్, ఇప్పుడు ఓటమి తప్పదనుకున్న సమయంలో బీసీలకు సీట్లు ఇచ్చి వారిని బలి కా బకరా చేస్తున్నాడని ధ్వజమెత్తుతున్నారు. బీసీలకు సీట్లు ఇచ్చినా గెల్వలేకపోతున్నారని, బద్నాం చేస్తున్నాడని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జరిగే ఓటమిని సాకుగా చూపి, భవిష్యత్‌లో అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో బీసీలకు ఆయన టికెట్లను నిరాకరించే ప్రమాదం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

అప్పుడు నాలుగే..

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లను బీఆర్‌‌ఎస్ గెలుచుకుంది. ఆ ఊపుతోనే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగింది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఆ ఎన్నికల్లో 4 సీట్లనే బీసీలకు ఇచ్చింది. ఇందులోనూ ఒకటి గెలుపునకు ఏమాత్రం అవకాశం లేని హైదరాబాద్ సీటు కట్టబెట్టింది.. దీంతో పాటు భువనగిరి, జహీరాబాద్, సికింద్రాబాద్ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ 4 సీట్లకు అదనంగా నిజామాబాద్, చేవెళ్ల సీట్లను కేటాయించారు. నిజామాబాద్‌లో రెండు పర్యాయాలు కల్వకుంట్ల కవిత పోటీ చేశారు. ఇప్పుడు పోటీకి ఆమె నిరాకరించడంతో బాజిరెడ్డి గోవర్దన్‌కు టికెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో చేవెళ్ల టికెట్‌ను వ్యాపారవేత్త రంజిత్‌ రెడ్డికి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆయన స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు చేవెళ్ల టికెట్‌ను కేటాయించారు.

బలమైన అభ్యర్థుల కొరత

మరోవైపు సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు బలమైన నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సైతం ఈసారి వెనుకంజ వేశారని సమాచారం. దీంతో సికింద్రాబాద్ అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే టి.పద్మారావుగౌడ్‌ను ఒప్పించి ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టికెట్‌ను గొల్లకురుమ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్ ఆశించారు. కానీ, ఆయనకు టికెట్ ఇవ్వకుండా మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఇచ్చారు. దీంతో కురుమలు సైతం బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారని భావించిన కేసీఆర్... భువనగిరి లోక్‌సభ టికెట్‌ను మల్లేశ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు.

మాజీ మంత్రి హరీశ్ రావుకు మెదక్ పార్లమెంటులో పట్టుండటంతో బీఆర్‌‌ఎస్‌కు కాస్తో, కూస్తో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అన్నీ తానై వ్యవహరిస్తాడని భావించిన అధిష్టానం మెదక్‌లో మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వెంకట్రామి రెడ్డికి టికెట్ ఇచ్చింది. మెదక్ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి సుమారు 2.80 లక్షల ఓట్లు సాధించిన బీసీ నాయకుడు గాలి అనిల్‌ కుమార్‌‌‌ను మరో నియోజకవర్గానికి బదిలీ చేశారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ పాటిల్ పార్టీ మారడంతో ఆ స్థానంలో అనిల్ కుమార్‌ను బరిలో నిలిపారు. హైదరాబాద్‌లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల ఎక్కువగా ఉన్నారు. దీంతో శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. యాదవుల ఓట్లను చీల్చి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

మండిపడుతున్న బీసీ నేతలు

మున్నూరు కాపులకు జహీరాబాద్‌, నిజామాబాద్‌ రెండు స్థానాలు, చేవెళ్ల ముదిరాజ్‌లకు, సికింద్రాబాద్‌ను గౌడ సా మాజికవర్గానికి, భువనగిరి స్థానాన్ని గొల్లకురుమలకు, హైదరాబాద్‌ స్థానాన్ని యాదవులకు కేటాయించింది. అయితే గెలిచే అవకాశాలు లేకపోవడంతో బీసీలకు ఈసారి ఎక్కువ స్థానాలను పార్టీ కేటాయించిందని పార్టీలోనే నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తింపు ఇవ్వని కేసీఆర్ కు ఇప్పుడు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చినట్లు అని మండిపడుతున్నారు.

Advertisement

Next Story