- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
262 ఉఫ్.. పంజాబ్ సూపర్ విక్టరీ
దిశ, స్పోర్ట్స్ : ప్లే ఆఫ్స్ ఆశలు నిలువాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఆ జట్టు విధ్వంసకర బ్యాటింగ్‌తో పుంజుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని.. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిందంటే ఆ జట్టు బ్యాటర్ల ఊచకోతను అర్థం చేసుకోవచ్చు. కోల్‌కతా వేదికగా శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్‌లో కోల్‌కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 261/6 స్కోరు చేసింది. సాల్ట్(75), సునీల్ నరైన్(71) సత్తాచాటారు. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ బెయిర్‌స్టో(108 నాటౌట్) అజేయ శతకంతో రెచ్చిపోగా.. శశాంక్ సింగ్(68 నాటౌట్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(54) మెరుపు హాఫ్ సెంచరీలు బాదారు. పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ ఒక్క స్థానాన్ని ఎగబాకి 8వ స్థానానికి చేరుకుంది.
ప్రభ్‌సిమ్రాన్‌తో మొదలు..
262 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ఏమాత్రం బెదరలేదు. ఛేదనలో ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, బెయిర్ స్టో మెరుపు ఆరంభం అందించారు. పవర్ ప్లేలో ముఖ్యంగా ప్రభ్‌సిమ్రాన్ సింగ్ విధ్వంసం వేరే లెవల్. రెండో ఓవర్‌లో రెండు సిక్స్‌లతో మొదలుపెట్టిన అతను.. చమీరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఊచకోతకోశాడు. దీంతో ప్రభ్‌సిమ్రాన్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 6వ ఓవర్‌లో బెయిర్ స్టో వరుసగా 6, 4, 4, 6 దంచి గేర్ మార్చాడు. అయితే, చివరి బంతికి ప్రభ్‌సిమ్రాన్ సింగ్(54) రనౌట్ అవడంతో అతని దూకుడుకు తెరపడింది. దీంతో పవర్ ప్లేలో పంజాబ్ 93/1 స్కోరుతో నిలిచింది. ప్రభ్‌సిమ్రాన్ అవుటైనా బెయిర్ స్టో దూకుడు కొనసాగింది. గత మ్యాచ్‌ల్లో తడబడిన అతను ఈ మ్యాచ్‌లో పుంజుకుని తాను ఎంత ప్రమాదకరమో మరోసారి రుచిచూపించాడు. రోసోవ్(26) ధాటిగా ఆడే క్రమంలో అవుటైనా.. అతని సహకారంతో బెయిర్ స్టో కేకేఆర్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బెయిర్ స్టో మరో 22 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. రోసోవ్ అవుటైన తర్వాత అక్కడి నుంచి శశాంక్ సింగ్ ఆట మొదలైంది. బెయిర్ స్టో నాన్ స్ట్రైకింగ్‌కే పరిమితమవ్వగా.. శశాంక్ కేకేఆర్ బౌలర్లపై పిడుగల్లే పడ్డాడు. సిక్స్‌ల మోత మోగించిన అతను 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో చూస్తుండగానే లక్ష్యానికి చేరువైన పంజాబ్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది.
రెచ్చిపోయిన నరైన్, సాల్ట్
అంతకుముందు కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ ఆట చూసి తీరాల్సిందే. ఓపెనర్లుగా వచ్చిన ఈ జోడీ పంజాబ్ బౌలర్లపై పంజా విసిరారు. రెండో ఓవర్‌లో సిక్స్, ఫోర్‌తో నరైన్ దూకుడు మొదలుపెడితే.. ఆ తర్వాతి ఓవర్‌లో సాల్ట్ వరుసగా 6, 4, 6 బాది తన ప్రతాపం చూపెట్టాడు. ఆ తర్వాత కూడా వీరు అదే దూకుడును కొనసాగించారు. రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, రబాడ, సామ్ కర్రన్.. ఇలా ఏ బౌలర్‌ను వదలకుండా పరుగుల వరద పారించారు. దీంతో 23 బంతుల్లో నరైన్, 25 బంతుల్లో సాల్ట్ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. 10 ఓవర్లలో 137/0 స్కోరుతో నిలిచిన కేకేఆర్ భారీ స్కోరుపై కన్నేసింది. అయితే, సెంచరీ దిశగా వేగంగా దూసుకెళ్తున్న సునీల్ నరైన్(71)ను రాహుల్ చాహర్ అవుట్ చేయడంతో పంజాబ్‌కు ఊరట లభించింది. దీంతో తొలి వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే ఫిలిప్ సాల్ట్(75)ను సామ్ కర్రన్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కూడా పంజాబ్ బౌలర్లు ఒకవైపు వికెట్లు తీస్తున్నా.. కేకేఆర్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చిన వాళ్లు వచ్చినట్టు బ్యాటు ఝుళిపించారు. వెంకటేశ్ అయ్యర్(39), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(28), రస్సెల్(24) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ టోర్నీ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. సామ్ కర్రన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీశారు.
స్కోరుబోర్డు
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ : 261/6(20 ఓవర్లు)
సాల్ట్(బి)సామ్ కర్రన్ 75, సునీల్ నరైన్(సి)బెయిర్‌స్టో(బి)రాహుల్ చాహర్ 71, వెంకటేశ్ అయ్యర్ రనౌట్(జితేశ్ శర్మ) 39, రస్సెల్(సి)హర్షల్ పటేల్(బి)అర్ష్‌దీప్ సింగ్ 24, శ్రేయస్ అయ్యర్(సి)రబాడ(బి)అర్ష్‌దీప్ సింగ్ 28, రింకు సింగ్(సి)అశుతోష్(బి)హర్షల్ పటేల్ 5, రమణ్‌దీప్ సింగ్ 6 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 13.
వికెట్ల పతనం : 138-1, 163-2, 203-3, 246-4, 253-5, 261-6
బౌలింగ్ : సామ్ కర్రన్(4-0-60-1), అర్ష్‌దీప్ సింగ్(4-0-45-2), హర్షల్ పటేల్(3-0-48-1), రబాడ(3-0-52-0), రాహుల్ చాహర్(4-0-33-1), హర్‌ప్రీత్ బ్రార్(2-0-21-0)
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 262/2(18.4 ఓవర్లు)
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ రనౌట్(నరైన్) 54, బెయిర్ స్టో 108 నాటౌట్, రోసోవ్(సి)శ్రేయస్ అయ్యర్(బి)నరైన్ 26, శశాంక్ సింగ్ 68 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 6.
వికెట్ల పతనం : 93-1, 178-2
బౌలింగ్ : దుష్మంత చమీరా(3-0-48-0), హర్షిత్ రాణా(4-0-61-0), అనుకుల్ రాయ్(2-0-36-0), సునీల్ నరైన్(4-0-24-1), వరుణ్ చక్రవర్తి(3-0-46-0), రస్సెల్(2-0-36-0), రమణ్‌దీప్ సింగ్(0.4-0-9-0)