IPL 2024 : ఆ జట్ల ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్ వాయిదా?

by Harish |
IPL 2024 : ఆ జట్ల ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్ వాయిదా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా ఈ నెల 17న కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అదే రోజున శ్రీరామ నవమి కావడంతో బీసీసీఐ ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. లోక్‌సభ ఎన్నికలు కూడా ఉండటంతో మ్యాచ్‌కు భద్రత కల్పించడం పోలీసులకు సవాల్‌గా మారనుంది. దీంతోనే బోర్డు ఆ మ్యాచ్‌ను వాయిదా వేయాలని చూస్తోంది.

ఇప్పటికే ఈ విషయాన్ని ఇరు జట్ల ఫ్రాంచైజీలతోపాటు బ్రాడ్‌కాస్టర్స్‌కు కూడా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బీసీసీఐ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కోల్‌కతా పోలీసులతో చర్చలు జరుపుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, దీనిపై బోర్డు అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మ్యాచ్‌‌ను కోల్‌కతా నుంచి తరలిస్తారా? లేదా వేరే తేదీకి వాయిదా వేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

కాగా, గత నెల 22న ప్రారంభమైన ఐపీఎల్ 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో కోల్‌కతా, రాజస్థాన్ జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు విజయం సాధించాయి. అయితే, మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో కోల్‌కతా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉండగా.. రాజస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నది.

Advertisement

Next Story