ఆ మూడింట్లో ఏది జరిగినా చెన్నయ్ ప్లే ఆఫ్స్‌కు చేరకున్నట్టే!

by Harish |
ఆ మూడింట్లో ఏది జరిగినా చెన్నయ్ ప్లే ఆఫ్స్‌కు చేరకున్నట్టే!
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇక, మిగిలింది ఒక్క బెర్తే. ఏ జట్టు నాకౌట్‌కు చేరుకుంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నెట్‌రన్‌రేట్ పరంగా వెనకబడిన ఢిల్లీ, లక్నోకు అవకాశం లేనట్టే. ఇక, చెన్నయ్, బెంగళూరు జట్ల మధ్య పోటీ. నేడు డూ ఆర్ డై మ్యాచ్‌లో ఇరు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి, చెన్నయ్ ముందడుగు వేస్తుందా? లేదంటే బెంగళూరు చాన్స్ కొట్టేస్తుందా? అనేది చూడాలి.

ఈ సీజన్‌లో నేడు బెంగళూరు వేదికగా బెంగళూరు, చెన్నయ్‌ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్‌తోనే ఇరు జట్ల భవితవ్యం కూడా తేలనుంది. నాకౌట్‌కు చేరుకునేందుకు చెన్నయ్‌కే అవకాశాలు ఎక్కువ. అందుకు కారణం నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉండటమే. 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సీఎస్కే 15 పాయింట్లు, +0.528 నెట్‌రన్‌రేట్‌తో ఇప్పటికే 4వ స్థానంలో ఉన్నది. ఆర్సీబీ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. 12 పాయింట్లు, +0.387 నెట్‌రన్‌రేట్‌ను కలిగి ఉంది. బెంగళూరుపై గెలిస్తే చెన్నయ్ 16 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవచ్చు. అదే జరిగి ఒకవేళ హైదరాబాద్, రాజస్థాన్ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడితే క్వాలిఫయర్-1 కూడా అర్హత సాధించొచ్చు. బెంగళూరుపై తక్కువ తేడాతో ఓడినా 14 పాయింట్లతో మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో ముందడుగు వేయొచ్చు.

మరోవైపు, బెంగళూరుకు చెన్నయ్‌పై గెలవడం తప్ప మరో దారి లేదు. గెలిస్తేనే సరిపోదు. సీఎస్కేతో పోలిస్తే మెరుగైన నెట్‌రేట్ కూడా ముఖ్యం. కాబట్టి, చెన్నయ్‌పై 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. అప్పుడు చెన్నయ్ కంటే ఆర్సీబీ మెరుగైన నెట్‌‌రన్‌రేట్ పొందుతుంది. వరుసగా ఐదు విజయాలతో బెంగళూరు ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరోవైపు, చెన్నయ్‌ను దాటడం అంటే అంత తేలిక కాదు. బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి, నేటి మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

వర్షం ముప్పు

ఈ కీలక పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. శనివారం ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటల నుంచి 10:30 గంటల వరకు వర్ష సూచన ఉన్నది. ఒక వేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే బెంగళూరు ఆశలు గల్లంతైనట్టే. చెన్నయ్‌ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

Advertisement

Next Story

Most Viewed