శ్రీలంక ఢమాల్.. సౌతాఫ్రికా బోణీ

by Harish |
శ్రీలంక ఢమాల్.. సౌతాఫ్రికా బోణీ
X

దిశ, స్పోర్ట్స్ : మాజీ చాంపియన్ శ్రీలంక టీ20 వరల్డ్ కప్‌ను ఓటమితో మొదలుపెట్టింది. సోమవారం న్యూయార్క్ వేదికగా జరిగిన గ్రూపు డి మ్యాచ్‌లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఓడించింది. తొలి మ్యాచ్‌తోనే దక్షిణాఫ్రికా టోర్నీలో గెలుపు ఖాతా తెరిచింది. మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది. టీ20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 78 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్వల్ప లక్ష్యమే అయినా పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో దక్షిణాఫ్రికాకు ఛేదనగా కష్టంగానే మారింది. ఆచితూచి ఆడుతూ లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఓపెనర్ డికాక్(20) టాప్ స్కోరర్. హెండ్రిక్స్ క్లాసెన్(19 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.

శ్రీలంక విలవిల

అంతకుముందు టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బ్యాటర్లు సఫారీల బౌలింగ్‌లో విలవిలలాడారు. కుసాల్ మెండిస్ చేసిన 19 పరుగులే టాప్ స్కోర్ అంటే ఆ జట్టు బ్యాటర్లు ఏ విధంగా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు.కుసాల్ మెండిస్‌తోపాటు మాథ్యూస్(16), కమిందు మెండిస్(11) మాత్రమే రెండెంకల స్కోరు చేశారు. మిగతా వారిలో నలుగురు డకౌటవ్వగా.. మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నోర్జే 4 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. అతని బౌలింగ్‌లో కుసాల్ మెండిస్, కమింద్ మెండిస్, మాథ్యూస్, అసలంక(6) వికెట్లు పారేసుకున్నారు. అతనికి మహరాజ్, రబాడా కూడా తోడవడంతో లంక జట్టు ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. దీంతో 19.1 ఓవర్లలోనే ఆ జట్టు 77 పరుగులే చేసి కుప్పకూలింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

శ్రీలంక ఇన్నింగ్స్ : 77 ఆలౌట్(19.1 ఓవర్లు)

(కుసాల్ మెండిస్ 19, నోర్జే 4/7, రబాడా 2/21, మహరాజ్ 2/22)

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ : 80/4(16.2 ఓవర్లు)

(డికాక్ 20, క్లాసెన్ 19 నాటౌట్, హసరంగ 2/22)

Advertisement

Next Story