అరంగేట్రం చేసిన 8 నెలలకే.. సంచలన నిర్ణయం తీసుకున్న నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్

by Harish |
అరంగేట్రం చేసిన 8 నెలలకే.. సంచలన నిర్ణయం తీసుకున్న నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : నెదర్లాండ్స్ బ్యాటర్ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్‌లో సోమవారం శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ ఓటమి అనంతరం అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే, 35 ఏళ్ల ఎంగెల్‌బ్రెచ్ట్ గతేడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 8 నెలలకే అతను ఇంటర్నేషనల్ కెరీర్‌కు ముగింపు పలకడం గమనార్హం.

సౌతాఫ్రికాలో జన్మించిన ఎంగెల్‌బ్రెచ్ట్ 2008-16 వరకు అక్కడి దేశవాళీ క్రికెట్‌లో పాల్గొన్నాడు. 2008 అండర్19 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా తరపున ఆడాడు. ఆ ప్రపంచకప్‌లో యంగ్ విరాట్ కోహ్లీని సూపర్ ఫీల్డింగ్‌తో అవుట్ చేశాడు. చాలా ఏళ్లు దేశవాళీలో ఆడినా జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.

2021లో నెదర్లాండ్స్‌కు వచ్చిన అతను క్రికెట్‌ను మాత్రం వదల్లేదు. క్లబ్ క్రికెట్‌లో సత్తాచాటి గతేడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ జట్టులో చోటు సంపాదించాడు. వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించిన అతను ఆ టోర్నీలో నెదర్లాండ్స్ తరపున 300 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫిబ్రవరిలో నేపాల్‌పై టీ20ల్లోకి అడుగుపెట్టాడు. మొత్తంగా నెదర్లాండ్స్ తరపున 12 వన్డేల్లో 385 పరుగులు, 12 టీ20ల్లో 280 రన్స్‌తోపాటు ఐదు వికెట్ల పడగొట్టాడు.

Advertisement

Next Story