ఐర్లాండ్‌పై చెమటోడ్చి నెగ్గిన పాక్

by Harish |
ఐర్లాండ్‌పై చెమటోడ్చి నెగ్గిన పాక్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో గ్రూపు దశలోనే ఎలిమినేట్ అయిన పాకిస్తాన్ టోర్నీని విజయంతో ముగించింది. ఆదివారం లాడర్‌హిల్ వేదికగా జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 3 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 106 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమవడంతో 36/6తో కష్టాల్లో కూరుకుపోయిన ఆ జట్టు 50 పరుగుల్లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే, డెలానీ(31), జోష్ లిటిల్(22 నాటౌట్), మార్క్ అడైర్(15) పాక్ బౌలర్లను ఎదుర్కొని నిలబడటంతో ఐర్లాండ్ ఆలౌట్ నుంచి బయటపడటంతోపాటు 100 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్(3/8), షాహీన్ అఫ్రిది(3/22), అమిర్(2/11) సత్తాచాటారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి పాక్ చెమటోడ్చింది. 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఒక వైపు వికెట్లు పడుతున్న తరుణంలో కెప్టెన్ బాబర్ ఆజామ్(32 నాటౌట్) క్రీజులో పాతుకపోయి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా, గ్రూపు ఏలో పాక్ రెండు విజయాలతో మూడో స్థానంతో సరిపెట్టింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్, అమెరికా తర్వాతి రౌండ్‌కు చేరుకున్నాయి. అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాక్ సూపర్ 8 రౌండ్ ఆశలు గల్లంతైన విషయం తెలిసిందే.

సంక్షిప్త స్కోరుబోర్డు

ఐర్లాండ్ ఇన్నింగ్స్ : 106/9(20 ఓవర్లు)

(డెలానీ 31, జోష్ లిటిల్ 22 నాటౌట్, ఇమాద్ వసీమ్ 3/8, షాహీన్ అఫ్రిది 3/22, అమిర్ 2/11)

పాకిస్తాన్ ఇన్నింగ్స్ : 111/7(18.5 ఓవర్లు)

(బాబర్ ఆజామ్ 32 నాటౌట్, షాహీన్ అఫ్రిది 13 నాటౌట్, మెక్కార్తి 3/15, కర్టిస్ కాంఫర్ 2/24)

Advertisement

Next Story