పాపువా న్యూగినియాపై న్యూజిలాండ్ విజయం

by Harish |
పాపువా న్యూగినియాపై న్యూజిలాండ్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌ను న్యూజిలాండ్ విజయంతో టోర్నీ ముగించింది. టరౌబా వేదికగా సోమవారం జరిగిన ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో పాపువా న్యూగినియాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినియా 19.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. చార్లెస్ అమిని(17) టాప్ స్కోరర్. ఫెర్గూసన్(3/0)తోపాటు సౌథీ, బౌల్ట్, ఇష్ సోధి రెండేసి వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం 79 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 12.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. ఫిన్ అలెన్(0), రచిన్ రవీంద్ర(6) నిరాశపర్చగా.. కాన్వే(35) పర్వాలేదనిపించాడు. డారిల్ మిచెల్(19 నాటౌట్), విలియమ్సన్(18) మిగతా పని పూర్తి చేశారు.

ఫెర్గూసన్ సంచలనం

టీ20ల్లో కివీస్ పేసర్ ఫెర్గూసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాపువా న్యూగినియా ఇన్నింగ్స్‌లో తన కోటా నాలుగు ఓవర్లు మెయిడిన్ చేశాడు. అంతేకాకుండా, మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. 4-4-0-3 గణాంకాలు నెలకొల్పిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే. టీ20ల్లో నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసిన రెండో బౌలర్‌ ఫెర్గూసన్. కెనడా బౌలర్ సాద్ బిన్ జాఫర్(2021లో పనామాపై 4 ఓవర్లు, 0 రన్స్, 2 వికెట్లు) తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. అలాగే, టీ20ల్లో 0.00 ఎకానమీతో బౌలింగ్ చేసిన మూడో బౌలర్‌‌గా ఫెర్గూసన్ నిలిచాడు. శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర(2014లో నెదర్లాండ్స్‌పై 2 ఓవర్లు, 0 రన్స్, 1 వికెట్) మొదటిసారిగా ఈ ఫీట్ నెలకొల్పాడు.

సంక్షిప్త స్కోరుబోర్డు

పాపువా న్యూగినియా ఇన్నింగ్స్ : 78 ఆలౌట్(19.4 ఓవర్లు)

(చార్లెస్ అమిని 17, ఫెర్గూసన్ 3/0, సౌథీ 2/11, బౌల్ట్ 2/14, ఇష్ సోధి 2/29)

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 79/3(12.2 ఓవర్లు)

(కాన్వే 35, మిచెల్ 19 నాటౌట్, విలియమ్సన్ 18 నాటౌట్, కబువా మోరియా 2/4)

Advertisement

Next Story