కప్పు వేటకు సిద్ధమైన టీమ్ ఇండియా.. నేడు ఐర్లాండ్‌తో పోరు

by Harish |
కప్పు వేటకు సిద్ధమైన టీమ్ ఇండియా.. నేడు ఐర్లాండ్‌తో పోరు
X

దిశ, స్పోర్ట్స్ : దాదాపు 17 ఏళ్ల క్రితం టీమ్ ఇండియా 2007‌లో టీ20 వరల్డ్ కప్‌ గెలిచింది. ధోనీ నాయకత్వంలో ప్రారంభ టోర్నీలో సత్తాచాటి చాంపియన్‌గా నిలిచింది. అప్పటి నుంచి మరోసారి ఆ కప్పు చిక్కలేదు. ప్రతి సారి టోర్నీలో ఫేవరెట్‌గా అడుగుపెట్టడం.. ఏదో ఒక దశలో ఇంటిదారిపట్టడం.. ఇలా 17ఏళ్లుగా టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. మరి, ఈ సారైనా టీమ్ ఇండియా నిరీక్షణ, భారత అభిమానుల ఆశలు నెరవేరేనా?.. టీ20 వరల్డ్ కప్ మొదలైంది. ఈ కప్పు వేటకు రోహిత్ సేన సిద్ధమైంది. తొలి పోరు నేడే. న్యూయార్క్ వేదికగా బుధవారం ఐర్లాండ్‌తో ఆడనుంది.

ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్‌కు గట్టి పోటీదారు అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. రోహిత్ సేనకు గ్రూపు దశ నామమాత్రమే అని చెప్పాలి. గ్రూపు ఏలో భారత్‌ సహా పాకిస్తాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా జట్లు ఉన్నాయి. గ్రూపులో పాక్‌ మినహా టీమ్ ఇండియాకు గట్టి పోటీ లేదు. కాబట్టి, సూపర్-8 రౌండ్‌కు చేరుకోవడం ఖాయమే. నేడు తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ప్రత్యర్థిపై రికార్డులను పరిశీలిస్తే విజయం భారత్‌కు నల్లేరు మీద నడకే.

రోహిత్‌కు జోడీ ఎవరు?..

ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టు నుంచి తుది టీమ్‌ను ఖరారు చేయడం హెడ్ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌లకు అంత సులభం కాదు. ఓపెనింగ్ పొజిషన్ నుంచి చివరి స్థానం వరకు పోటీ గట్టిగానే ఉంది. టీ20 ప్రపంచకప్‌ గురించి చర్చ మొదలైనప్పటి నుంచి రోహిత్‌కు జోడీగా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఓపెనర్ బెర్త్ కోసం జైశ్వాల్, శాంసన్ కూడా పోటీలో ఉన్నారు. వార్మప్ మ్యాచ్‌లో శాంసన్ నిరాశపర్చినా అతని అవకాశాలను కొట్టిపారేయలేం. కానీ, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్, నం.3లో కోహ్లీ పాత్ర దృష్ట్యా రోహిత్‌తో కలిసి జైశ్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సూర్యకుమార్, పంత్, పాండ్యా స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. మరో రెండు ఆల్‌రౌండ్ స్థానాల కోసం జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబెల మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఏ ఇద్దరికి చోటు దక్కుతుందో చూడాలి. బుమ్రా బౌలింగ్ దళాన్ని నడిపించనుండగా.. మరో పేసర్ స్థానం కోసం సిరాజ్, అర్ష్‌దీప్ పోటీలో ఉన్నారు. అర్ష్‌దీప్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో కుల్దీప్ యాదవ్‌కు చోటు ఖాయంగా కనిపిస్తోంది.

ఐర్లాండ్‌లో వీళ్లు కీలకం

చిన్న జట్టే కదా అని ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టులోనూ మ్యాచ్ విజేతలు ఉన్నారు. ఇటీవల ఆ జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. మార్చిలో ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది. కాబట్టి, ఆ జట్టును తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఐర్లాండ్ బ్యాటింగ్ దళంలో పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే, జాషువా లిటిల్, క్రెయిగ్ యంగ్, బెంజిమిన్ వైట్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు.

భారత్‌దే ఆధిపత్యం

టీ20ల్లో భారత్, ఐర్లాండ్ జట్లు 8 జట్లు తలపడగా.. ఏడింటా టీమ్ ఇండియానే గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గతేడాది మూడు మ్యాచ్‌ల కోసం ఐర్లాండ్‌లో పర్యటించిన భారత జట్టు 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ రద్దైంది.

పిచ్ రిపోర్టు

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలించనుంది. ఇక్కడ రెండు మ్యాచ్‌ల్లో జరగగా బౌలర్లు ప్రభావం చూపించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో శ్రీలంక 77 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి సౌతాఫ్రికా కూడా కష్టపడాల్సి వచ్చింది.

తుది జట్లు(అంచనా)

భారత్ : రోహిత్(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కోహ్లీ, సూర్యకుమార్, రిషబ్ పంత్, పాండ్యా, అక్షర్ పటేల్/జడేజా, కుల్దీప్, అర్ష్‌దీప్, సిరాజ్, బుమ్రా.

ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, లోర్కాన్ టక్కర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్.

Advertisement

Next Story

Most Viewed