T20 World Cup : ఫెర్గూసన్ సంచలనం.. నాలుగు ఓవర్లు, 3 వికెట్లు, 0 రన్స్

by Harish |
T20 World Cup : ఫెర్గూసన్ సంచలనం.. నాలుగు ఓవర్లు, 3 వికెట్లు, 0 రన్స్
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ పేసర్ ఫెర్గూసన్ సంచలనం సృష్టించాడు. తన కోటా నాలుగు ఓవర్లు మెయిడిన్ వేసి టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాపువా న్యూగినియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన కోటా నాలుగు ఓవర్లలో ఫెర్గూసన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా, మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నెలకొల్పాడు.

టీ20ల్లో నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసిన రెండో బౌలర్‌ ఫెర్గూసన్. కెనడా బౌలర్ సాద్ బిన్ జాఫర్ తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. 2021లో పనామాపై 4 ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే, టీ20ల్లో 0.00 ఎకానమీతో బౌలింగ్ చేసిన మూడో బౌలర్‌‌గా ఫెర్గూసన్ నిలిచాడు. శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర మొదటిసారిగా ఈ ఫీట్ నెలకొల్పాడు. 2014లో నెదర్లాండ్స్‌పై రెండు ఓవర్లు వేసిన అతను ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఒక్క వికెట్ పడగొట్టాడు.

మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినియా 19.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌటైంది. ఫెర్గూసన్ 3 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో అస్సద్ వాలా(6), చార్లెస్ అమిని(17), చాడ్ సోపర్(1) అవుటయ్యారు. అతనితోపాటు బౌల్ట్, సౌథీ, ఇష్ సోధి రెండేసి వికెట్లు పడగొట్టడంతో ప్రత్యర్థి కుప్పకూలింది.

Advertisement

Next Story