హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్.. కాపాడిన ‘100’ పోలీసులు

by Bhoopathi Nagaiah |
హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్.. కాపాడిన ‘100’ పోలీసులు
X

దిశ, మద్దూరు : తనతో ఉద్యోగం చేసే యువతికి మాయమాటలు చెప్పి ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లాకు తీసుకెళ్లాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫోన్ చేయడంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. చేర్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎల్.శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ములుగు జిల్లా, ఏటూరు నాగారం మండలం, గూగుల్లపల్లి గ్రామానికి చెందిన తీగల రాజశేఖర్ రెడ్డి, హనుమకొండ జిల్లా, వేలర్ మండలం, ఎర్రబెల్లి గ్రామానికి చెందిన నాలిబాల శిరీష కూకట్ పల్లి అస్పిరో ఫార్మాసిటికల్స్ కంపెనీలో పని చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న రాజశేఖర్ రెడ్డి మంగళవారం శిరీషకు మాయ మాటలు చెప్పి హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలంలోని జల్లెగూడెం గ్రామానికి తీసుకువచ్చాడు. అక్కడ రాజశేఖర్ రెడ్డి ప్రవర్తనపై అనుమానం వచ్చిన శిరీష చాకచక్యంగా వ్యవహరించి డయల్ 100కు కాల్ చేసి తను కిడ్నాప్‌కు గురైనట్లు తెలిపింది.

వెంటనే స్పందించిన మద్దూరు ఎస్సై షేక్ మహబూబ్, ఏఎస్ఐ జగదీష్ జల్లెగూడెం గ్రామానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని యువతిని రక్షించారు. మరోవైపు శిరీష మిస్సింగ్ అయినట్లు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీంతో మద్దూరు పోలీసులు నిందితుడిని కూకట్ పల్లి పోలీసులకు అప్పగించినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎల్.శ్రీను తెలిపారు. 100 డయల్ రాగానే వెంటనే స్పందించి కిడ్నాప్‌కు గురైన యువతిని కాపాడిన మద్దూరు ఎస్సై షేక్ మహబూబ్, ఏఎస్ఐ జగదీష్‌లను సిటీ పోలీస్ కమిషనర్ అనురాధ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed