పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్టు

by Aamani |
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్టు
X

దిశ, మిర్యాలగూడ : భార్యలు రేషన్ డీలర్లు కాగా భర్తలు అక్రమ పీడీఎస్ బియ్యం వ్యాపారం చేస్తూ పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యారు. అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న పలువురు వ్యక్తులను మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం జంకుతండా గ్రామానికి చెందిన ధనావత్ నరేంద్ర నాయక్, ప్రకాష్ నగర్ కు చెందిన, రమావత్ శ్రీను, గోగు వారి గూడెం గ్రామానికి చెందిన ఉట్ల వెంకటేశ్వరరావు, ఇందిరమ్మ కాలనీ చెందిన పసుమర్తి నాగేశ్వరరావు, తుంగ పహాడ్ గ్రామానికి చెందిన బీర్ల వెంకట్ రెడ్డిలు తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్ కు చెందిన పోతుగంటి శ్రీనివాస్, హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన పంపాటి శ్రీనివాస్, మిర్యాలగూడ పట్టణం శాంతినగర్ కు చెందిన కొమ్మన పట్టాభి రామయ్య లకు ట్రేడింగ్ పేపర్లను అడ్డుపెట్టుకుని అమ్ముతున్నట్లు తెలిసింది అన్నారు. కాగా ఈ నెల 12న జంకు తండా గ్రామంలో ధనావత్ నరేందర్ కు చెందిన శ్రీ లక్ష్మీ మినీ ప్యాడి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 40 టన్నుల రేషన్ బియ్యం నమ్మదగిన సమాచారం ద్వారా దాడులు చేసి రూరల్ పోలీసులు పట్టుకున్నారు.

ఆ బియ్యాన్ని పైన నిందితులుగా పేర్కొన్న వారి నుంచి కొనుగోలు చేసి మిల్లులో పాలిష్ పట్టి నూకలు గా మార్చి హైదరాబాదుకు ట్రేడింగ్ కంపెనీల ద్వారా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. అక్రమ రేషన్ బియ్యానికి పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు. కాగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం లో కీలక పాత్ర పోషిస్తున్న ధనావత్ నరేందర్ నాయక్ తో పాటు రమణ అనే వ్యాపారులపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. రిమాండ్ అనంతరం నరేందర్ కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా అక్రమంగా రేషన్ బియ్యం విక్రయిస్తున్న వారిలో ఆయా గ్రామాలకు చెందిన డీలర్ల భర్తలు ఉండటం విశేషం. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, ఎస్సై నరేష్ కుమార్, కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ దస్రు, శ్రీనివాస్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, నాగయ్య, సైదయ్య, మహేష్, సైదా నాయక్, వెంకటేశ్వర్లు, హోంగార్డు మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story