- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతా రామమయం.. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠకు వేళాయె
దిశ, నేషనల్ బ్యూరో: రామభక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రామజన్మభూమి రామనామ స్మరణతో పులకించే శుభ వేళ ఎట్టకేలకు విచ్చేసింది. సోమవారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈసందర్భంగా అయోధ్యా నగరం రామనామస్మరణతో మార్మోగనుంది. ప్రాణప్రతిష్ఠ తర్వాత 12.55 గంటలకు హెలికాప్టర్‌తో అయోధ్య రామమందిరంపై పూలవర్షం కురిపిస్తారు. దాదాపు 800 మంది కార్మికులు అయోధ్య రామమందిరాన్ని, అయోధ్య నగరాన్ని పుష్పాలతో అలంకరించారు. ఇందుకోసం దాదాపు 1100 టన్నుల పూలను వాడారు. ప్రధాని మోడీ అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి ఆరు కిలోమీటర్లు రోడ్డుమార్గం మీదుగా ప్రయాణించి రాముడి ఆలయానికి చేరుకుంటారు. ఈ మార్గాన్ని కూడా బంతిపూలతో అలంకరించారు. రోడ్డుకు ఇరువైపులా ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
పాస్ ఉన్న వాహనాలకే ఎంట్రీ
ఈ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యా నగరంవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, ఏటీఎస్ కమాండోలు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గట్టి పహారా కాస్తున్నారు. ఫైజాబాద్ నుంచి అయోధ్యకు వచ్చే ప్రధాన రహదారిపై భద్రతా దళాలు బారికేడ్లను ఏర్పాటు చేశాయి. అక్కడి నుంచి పాస్ ఉన్న వాహనాలనే అయోధ్య వైపునకు అనుమతిస్తున్నారు. దాదాపు 30 వేల మంది పోలీసులను అయోధ్యలో భద్రతకు మోహరించినట్లు యూపీ పోలీసు అధికారులు ప్రకటించారు. 10వేల సీసీ కెమెరాలు అమర్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్య దారుల్లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) కమాండోలు కవాతు నిర్వహిస్తున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠ కోసం ఆహ్వానాలు అందుకున్న ముఖ్య అతిథులు సోమవారం ఉదయం 10 గంటలకల్లా ఆలయానికి చేరుకుంటారు.
10 లక్షల దీపాలతో అయోధ్య అలంకరణ
బాలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని అయోధ్య రామమందిరాన్ని సోమవారం సాయంత్రం 10 లక్షల దీపాలతో అలంకరించనున్నారు. ఈవిషయాన్ని రామజన్మభూమి ట్రస్టు వెల్లడించింది. రామాలయం, రామ్‌కీ పైదీ, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చవానీ, ఇతర ప్రముఖ ప్రదేశాలతో సహా ఏకంగా 100 ఆలయాల్లో ఈ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపింది. దీనికోసం మట్టి ప్రమిదలను ఉపయోగించనున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం వేళ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార కార్యాలయాల్లో దీపాలను వెలించాలని ప్రధాని మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత ఏడేళ్ల నుంచి అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తోంది.