అమ్మ బరువైంది.. ఊరికి దూరమైంది

by srinivas |

దిశ, ఏపీ బ్యూరో: నవమాసాలు మోసి పెంచిన తల్లి ఆ బిడ్డలకు బరువైంది. ఎండకు ఎండి, వానకు తడిసి చావమని ఆమెను అడవిపక్కన వదిలేసి వెళ్లిపోయారా కనికరం లేని కొడుకులు. ఎవరో కన్న బిడ్డలు మాత్రం ఆమెకు ఊరటకలిగించేందుకు చర్యలు చేపట్టారు. కొందరు మానవత్వం మరచి దుశ్చర్యకు పాల్పడితే ఇంకొందరు మానవత్వం చూపిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. దీని వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పెంగరగుంట పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో 90 ఏళ్ల వృద్ధురాలు దీనంగా కూర్చుంది. ఆమెను చూసిన స్థానికులు ఆమెను కుంటిగంగమ్మ ఆలయం వద్దకు చేర్చారు. మూడు రోజులుగా ఆమె ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అక్కడే ఉండడంతో వాలంటీర్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో వాలంటీర్ భోజన సాయం చేశారు.

ఎవరైనా వచ్చి తీసుకెళ్తారని ఎదురు చూసిన వాలంటీర్లకు నిరాశే మిగిలింది. అంతేకాకుండా ప్రతికూల వాతావరణానికి తోడు సరైన భోజనం లేక నీరసించిపోయింది. వివరాలడిగేందుకు ఆమె స్పందించే స్థితిలో లేదు. దీంతో పలమనేరు తహసీల్దార్‌కు సమాచారం అందించారు. ఆయన వచ్చి ఆమెను ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కు తరలించారు. అక్కడ ఆమెకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కాగా, ఆమెకు కరోనా సోకిందని అనుమానించి సరిహద్దుల్లోని తమిళనాడు గ్రామం నుంచి ఆమెను ఆమె కుమారులే ఇక్కడ వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె కుటుంబ వివరాలు తెలిశాక అప్పగిస్తామని తహసీల్దార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed