మౌత్ ఆర్టిస్ట్ మధు రంగుల ‘కళ’

by Shyam |
మౌత్ ఆర్టిస్ట్ మధు రంగుల ‘కళ’
X

దిశ, వెబ్‌డెస్క్: అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం.. ఎనిమిదేళ్ల చిన్నోడి రెండు చేతులు, కాళ్లు కోల్పోయేలా చేసింది. తన జీవితంలో అంత పెద్ద నష్టం జరిగినా.. ఆ కుర్రాడు మాత్రం మనోధైర్యం కోల్పోకుండా తన భవిష్యత్తుపైనే దృష్టిపెట్టాడు. వైకల్యం శరీరానికే కాని, మనసుకు కాదని.. ప్రతిభ ఉంటే ప్రపంచమే సలాం చేస్తుందని బలంగా నమ్మాడు. కేవలం ఆరు నెలల్లోనే నోట్లో బ్రష్ పెట్టుకుని కుంచెపై అద్భుతమైన రంగురంగుల చిత్రాలు వేసే స్థాయికి వచ్చాడు. కుంచెపైనే కాదు, తన జీవితాన్ని కూడా కారుచీకట్ల నుంచి వేల వన్నెల వైపు తీసుకెళ్తున్న ఆ చిన్నోడే మధు కుమార్. ఆహా డిజిటల్ ప్రొగ్రామ్ ‘సామ్ జామ్’ మెగా షోలో తన కుంచె ప్రతిభ చూపించి మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు అందుకున్న మెదక్ చిన్నోడు మధు కుమార్ విశేషాలు మీకోసం..

మునిపల్లె మండలంలోని కమ్కోలే గ్రామానికి చెందిన మధుకుమార్ ఆరో తరగతి చదువుతున్నాడు. ఏడాది క్రితం వాళ్ల ఇంటి డాబాపైన ఆడుకుంటుండగా, పవర్ లైన్‌‌ను తాకిన ఐరన్ రాడ్‌ను టచ్ చేయడంతో.. మధు పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాల నుంచి బయటపడినా, తన రెండు చేతులతో పాటు కాళ్లను కూడా కోల్పోయాడు. ఇంత చిన్న వయసులోనే వైకల్యం పొందినా.. ఏ మాత్రం నిరుత్సాహపడకుండా తన చదువును కొనసాగించాడు. ఈ క్రమంలోనే మధుకు తోడైన ప్రముఖ యంగ్ ఆర్టిస్ట్ సముద్రాల హర్ష.. అతడిని మౌత్ ఆర్టిస్ట్‌గా మలిచి, రంగుల జీవితానికి బాట వేశాడు. కేవలం ఆరు నెలల్లోనే కుంచెతో సెలెబ్రిటీల నుంచి ప్రకృతి అందాల వరకు ఎన్నో చిత్రాలను అలవోకగా గీసే నేర్పును సాధించాడు మధు. ప్రస్తుతం హర్షతో కలిసి, ఎన్నో లైవ్ ఈవెంట్స్‌లో ప్రదర్శనలిస్తున్న మధు.. సామ్ జామ్‌ మెగా ప్రోగ్రామ్‌లో మెగాస్టార్ చిరంజీవి బొమ్మ గీసి ఔరా అనిపించాడు. ‘నేను మధును చూశాను. ఈ అబ్బాయి నోటితో ఆర్ట్ వేస్తాడు కదా’ అని చిరంజీవి కూడా మధును గుర్తుపట్టడం విశేషం.

‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ప్రమాదం జరిగిన తర్వాత నుంచి స్కెచ్ వేయడం నేర్చుకుంటున్నాను. మొదట్లో కాస్త నిరాశ చెందినా, ఎంతోమంది నాకు సాయం చేయడంతో పాటు హర్ష అన్నయ్య సాయంతో మౌత్ ఆర్టిస్ట్‌గా మారి ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాను’ అని మధు తెలిపాడు. మధు వాళ్ల అమ్మ గృహిణి కాగా, నాన్న పంక్చర్ షాప్ నడిపిస్తాడు.

Advertisement

Next Story

Most Viewed