పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మందికి పైగా మృతి

by Sumithra |
bus-accident
X

దిశ, వెబ్‌డెస్క్ : పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 27 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుుస్తోంది. మరో 40 మంది వరకూ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ దుర్ఘటన పంజాబ్‌లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతంలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. ప్రమాదం జరిగిన సమయంలో సియాల్‌కోట్ నుంచి రాజన్‌పూర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అతివేగంతో వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 27 మంది ప్రయాణికులు చనిపోయినట్లు కమిషనర్ డాక్టర్ ఇర్షాద్ అహ్మద్ తెలిపారు. మరో 40 మంది క్షతగాత్రులవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాక్ జాతీయ మీడియా వివరించింది. బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రయాణికులు వారి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుండగా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Next Story