బతుకమ్మ చీరెలు తీసుకోలే..

by Shyam |
బతుకమ్మ చీరెలు తీసుకోలే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి ఇందూరు జిల్లాలో బతుకమ్మ చీరెలు తీసుకునేందుకు మహిళలు అనాసక్తిని ప్రదర్శించారు. అడ్రస్‌ పొంతన లేకపోడం, నాసీరకం చీరలు వెరసి చీరెలు తీసుకునేందుకు మహిళలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అధికారులు ఇల్లిల్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో సుమారు 25వేల చీరెలు గుట్టలుగా పేరుకుపోయాయి.

ఉమ్మడి ఇందూరు జిల్లాలో బతుకమ్మ పండుగ కోసం వచ్చిన చీరెలను తీసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం ఈసారి సిరిసిల్ల నేత కార్మికుల ద్వారా వందల కోట్ల వ్యయంతో 18 రకాల డిజైన్లతో బతుకమ్మ చీరెలను తయారు చేయించిన విషయం తెలిసిందే. వాటిని బతుకమ్మ పండుగ ముందే జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మెప్మా అధ్వర్యంలో పంపిణీ చేసేందుకు కసరత్తు చేసింది. కానీ నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ 12 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ నెల13 తర్వాత చీరెల పంపిణీ ప్రారంభించారు. జిల్లాకు 8,11,717 చీరెలను తెప్పించగా, వాటిని ఈ నెల 14, 15, 16 తేదీల్లో రేషన్ దుకాణాల వారీగా డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

పేరుకుపోయిన చీరెలు..

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 8,11,717 మంది మహిళలకు చీరెలను కేటాయించారు. అందులో నిజామాబాద్ జిల్లాకు 4.83 లక్షలు, కామారెడ్డి జిల్లాకు 3,28,717 చీరెలను కేటాయించారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 4,68,850, కామారెడ్డి జిల్లాలో 3,18, 632 మందికి చీరెలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో 24,235 మంది చీరలను తీసుకునేందుకు ముందుకు రాలేదు. వాటిని తిరిగి రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఇప్పుడు జిల్లాలోని ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో వాపస్ చేసిన బతుకమ్మ చీరెలు గుట్టలుగా పేరుకుపోయి దర్శనం ఇస్తున్నాయి.

పొంతన కుదరని అడ్రస్..

డీఆర్‌డీఏ, మెప్మా సిబ్బంది రేషన్ కార్డులలో ఉన్న అడ్రస్‌లకు, సంబంధిత శాఖ అధికారులు ఇచ్చిన అడ్రస్‌లకు పోంతన కుదరకపోవడంతో బతుకమ్మ చీరెలు పేరుకుపోవడానికి కారణంగా తెలుస్తున్నది. కాగా ఉమ్మడి ఇందూరు జిల్లాలో 98 శాతం మంది రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను తీసుకునే వారు ఉన్నా చీరెలను తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. అధికారులు ఇంటింటికి తిరిగినా ఫలితం లేకుండా పోయింది. బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉన్నాయని, మార్కెట్లో అగ్గువ సగ్గువకు దోరికేవాటిని తమకు అంటగడుతున్నారని వాటిని తీసుసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపలేదని తెలుస్తున్నది.

Advertisement

Next Story