ఐదు రోజుల్లో 220 కరోనా మరణాలు, 7,286 కొత్త కేసులు

by vinod kumar |
ఐదు రోజుల్లో 220 కరోనా మరణాలు, 7,286 కొత్త కేసులు
X

ఏపీలో వెయ్యి మార్కు దాటిన పాజిటివ్‌లు
13 ఏళ్ళ బాలుడికి కరోనా

దిశ, న్యూస్‌బ్యూరో: ఎన్ని కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నా, లాక్‌డౌన్ అమలవుతున్నా కరోనా కొత్త కేసులు మాత్రం పుట్టుకొస్తునే ఉన్నాయి. గడచిన 24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,490 కొత్త కేసులు నమోదుకాగా, 56మంది చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కు, మొత్తం మృతుల సంఖ్య 779కు చేరుకుంది. గడచిన ఐదు రోజుల గణాంకాలను పరిశీలిస్తే ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా 17,656 పాజిటివ్ కేసులు ఉంటే 25వ తేదీ నాటికి అది 24,942కు చేరుకుంది. కరోనా కారణంగా ఆరోజు వరకు 559 మంది చనిపోతే ఇప్పుడు 779కు చేరుకుంది. ఐదు రోజుల వ్యవధిలో 7,286 కొత్త కేసులు, 220 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి మార్కు దాటితే ఇప్పుడు మరో రెండు రాష్ట్రాలు చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 61 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,061కు చేరుకుంది. గుజరాత్ రాష్ట్రం సైతం మూడువేల మార్కును దాటింది. కేసుల డబ్లింగ్ సమయం పది రోజులకు పెరిగినా ఇటీవలి కాలంలో ప్రతీరోజు 1,400 కంటే ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి.

కనీసంగా ఐదారు రాష్ట్రాల్లో ప్రతీరోజూ 100 కంటే ఎక్కువగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర మొత్తంమీద చూసుకుంటే వైరస్ తీవ్రత ముంబయి నగరంలోనే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ముంబయి నగరం దాదాపు మూడింట రెండొంతులుగా ఉంది. వారం రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకే కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆ రాష్ట్రంలో అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో పర్యటించి నివేదిక ఇవ్వాల్సిందిగా రెండు వేర్వేరు కేంద్ర బృందాలను నియమించింది. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది మాత్రమే కాక జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతుండడంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుమారు 170 మందికి పరీక్షలు నిర్వహించింది. అన్నీ నెగెటివ్ వచ్చాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పరీక్షలు జరిగాయి. రెండుచోట్లా కలిపి సుమారు 80 మందికి పాజిటివ్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్నాటక ప్రభుత్వం పాత్రికేయులకు కరోనా నిర్ధారణ పరీక్షను తప్పనిసరి చేసింది.

తెలంగాణలోని మొత్తం 33జిల్లాల్లో నాలుగు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఉన్నాయి. ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో 13 ఏళ్ళ బాలుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపి గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఆదివారం ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించనుంది. తొలుత వయసు ఎక్కువగా ఉన్నవారికే వస్తుందని వైద్యాధికారులు భావించినా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నెలల శిశువుకు కూడా వస్తోంది.

Tags: Corona Positive, Corona Positive, Telangana, AP, Containment Zone, Warangal, Gujarat, Maharashtra, Home Ministry, Journalists

Advertisement

Next Story

Most Viewed