22మంది వలస కార్మికులు.. క్వారంటైన్ నుంచి ఎస్కేప్

by vinod kumar |
22మంది వలస కార్మికులు.. క్వారంటైన్ నుంచి ఎస్కేప్
X

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో క్వారంటైన్ నుంచి 22 మంది వలస కార్మికులు గురువారం రాత్రి ఎస్కేప్ అయ్యారు. తెలంగాణ నుంచి తిరిగి స్వరాష్ట్రంలోని బస్తర్ రీజియన్‌కు చేరిన ఈ కార్మికులను ఓ క్వారంటైన్ సెంటర్‌లో ఉంచగా.. గురువారం రాత్రి పరారైనట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వీరిని ఇంకా పట్టుకోలేదు. సంబంధిత గ్రామ సర్పంచ్, కార్యదర్శులకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లా కలెక్టర్ తోపేశ్వర్ వర్మ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 47 మంది వలస కార్మికులు జిల్లాకు తిరిగివచ్చారన్నారు. గురువారంనాడు ఆరాన్‌పుర్ చేరుకున్న ఈ కార్మికులందరికీ మెడికల్ పరీక్షలు జరిపినట్టు తెలిపారు. అనంతరం వారి సొంతూళ్లకు పంపివ్వకుండా ఆరాన్‌పుర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీకి తరలించారు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి 22 మంది వలస కార్మికులు పరారయ్యారు. భయపడేదేమీ లేదని, వారిలో వైరస్ లక్షణాలైతే కనిపించలేదని కలెక్టర్ వివరించారు. అయితే, పారిపోయిన వారిని తిరిగి క్వారంటైన్‌కు పంపించాల్సిందిగా వారి గ్రామ సర్పంచ్, కార్యదర్శులకు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఆ కార్మికుల గ్రామం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన నహాద్‌ గ్రామం. మావోయిస్టుల కోర్ గ్రామం కావడంతో అధికారులు, పోలీసులు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. అందుకే సర్పంచ్, కార్యదర్శులకు వివరించినట్టటు తెలిపారు. ఇప్పటికైతే వారి నుంచి వివరాలు రాలేదని తెలిపారు.

TAGS: quarantine, escape, migrant labourers, maoist, 22 migrant labourers escaped

Advertisement

Next Story