ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణపై పునరాలోచించండి

by Shamantha N |   ( Updated:2020-08-30 11:12:17.0  )
ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణపై పునరాలోచించండి
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థ పనితీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లాయర్ ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ కింద సర్వోన్నత న్యాయస్థానం చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు క్షమాపణ చెప్పాలని మూడు రోజుల సమయం ఇచ్చింది. దానికి ప్రశాంత్ భూషణ్ నిరాకరించడంతో సోమవారం ఆయనకు ఏ శిక్ష అమలు చేయాలనేదానిపై సోమవారానికి తీర్పు రిజర్వు చేసింది. రేపు సుప్రీంకోర్టు తీర్పు చెప్పనున్నందున దానిపై పునసమీక్ష చేయాలని కోరుతూ 122 మంది లా విద్యార్థులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, ఇతర న్యాయవాదులకు లేఖలు రాశారు.

“ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారా విమర్శలకు న్యాయవ్యవస్థ ప్రత్యుత్తరం ఇవ్వాలి. న్యాయవ్యవస్థ తన కేసును మార్చడం ద్వారా విమర్శలకు సమాధానం ఇవ్వాలి. అంతేకానీ, న్యాయంపై ప్రేమతో కూడిన విమర్శలు వచ్చినప్పుడు కోర్టు ధిక్కార అభియోగాలు మోపకూడదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా పారదర్శకత, జవాబుదారీతనం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటి కోసం ప్రశాంత్ భూషణ్ ఏళ్ల తరబడి పోరాడుతున్నారని విద్యార్థులు గుర్తు చేశారు. భూషణ్ చేసిన ఆ ట్వీట్లు గొంతులేని అట్టడుగు వర్గాల వేదనకు అద్దం పడుతున్నాయని, అవి న్యాయస్థానం పవిత్రతను దెబ్బతీయవని లా విద్యార్థులు ఆ లేఖ ద్వారా కోరారు.

Advertisement

Next Story