- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిలో మీటరుకు రూ.కోటి!
దిశ, తెలంగాణ బ్యూరో: కిలో మీటర్ పొడవున కొత్తగా బీటీ రోడ్డు వేయాలంటే గరిష్ఠంగా ఎంత ఖర్చవుతుంది.. సుమారు రూ.రెండు కోట్లు, అదే సీసీ రోడ్డయితే రూ.కోటిన్నర. మీ సమాధానాలు ఇవే అయితే రోడ్ల నిర్మాణంపై మీకు అవగాహన లేనట్టే.. మీరు సివిల్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు అయినా పర్వాలేదు.. మీరు లెక్కల్లో వీక్, ఆ రంగంలో మీరు వెనకబడ్డారు అని చెప్పక తప్పదు. కావాలంటే మీరు జీహెచ్ఎంసీ గణంకాలతో సరిపోల్చవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టే ప్రతి కిలోమీటర్ రోడ్డు మరమ్మతులకే కాస్త అటూఇటుగా రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేశారు. అదే పూర్తి రోడ్డు వేయాలంటే అందుకు రెండింతలైనా ఖర్చు చేయాల్సిందే కదా.. ఇప్పుడు అనిపిస్తోందా కోటి రూపాయలతో మరమ్మతులు చేసే రోడ్ల నాణ్యత, టెక్నాలజీతో వేస్తున్నారో చూడాలంటే గ్రేటర్ రోడ్లను చూడండి. కోటి రూపాయల రోడ్లకు ఎలా ప్రణాళికలు వేయాలో జీహెచ్ఎంసీ అధికారుల వద్దకు వెళ్లి తెలుసుకోవాల్సిందే.
ఇటీవల కురిసిన వర్షాలతో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. బీటీ, సీసీ రోడ్లు కొట్టుకుపోయాయి. మూసీ నదిపై నిర్మించిన వంతెనలతో పాటు పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా రోడ్లు కొట్టుకు పోయాయని బల్దియా, ప్రభుత్వం బుకాయించినా.. రోడ్ల నిర్మాణంలో అనుసరించిన డిజైన్, టెక్నాలజీ, నాణ్యత విషయాలను ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రోడ్ల డిజైనింగ్‌లో నాణ్యత లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం రోడ్ల పేరుతో లూటీ అవుతోందని వారు చెబుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్ల మరమ్మతులకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీహెచ్ఎంసీ వృథాగా ఖర్చు చేస్తోంది.
అయినా రోడ్లపై గుంతలు పోవడం లేదు. నిత్యం ఏదో ఒక చోట రోడ్లపై గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాలు కారణంగా చూపి మరోసారి రోడ్ల మరమ్మతులు అంటూ రూ.కోట్ల ఖర్చుకు బల్దియా సిద్ధమవుతోంది. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, ఎల్బీనగర్, సరూర్‌గర్, హిమాయత్ నగర్, నారాయణగూడ, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో రహదారులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రోడ్ల మరమ్మతులకు రూ.522 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన జీహెచ్ఎంసీ రూ.459 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
కిలోమీటర్ మరమ్మతుకు రూ.కోటి!
రోడ్డు మోయాల్సిన బరువును బట్టి 90 టన్నుల సామర్థ్యం గల బీటీ రోడ్డు కిలోమీటర్ వేయడానికి రూ.రెండు కోట్లు, 60 టన్నుల సామర్థ్యం రోడ్లయితే రూ.1.30 కోట్లు ఖర్చవుతుంది. అదే సీసీ రోడ్లయితే గరిష్ఠంగా రెండు కోట్లు మాత్రమే.. నూతనంగా వచ్చిన వీడీసీసీ టెక్నాలజీలో అయితే రూ. నాలుగు కోట్లు కొత్త రోడ్లకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకే దాదాపు రూ.కోటి ఖర్చు వస్తుందని జీహెచ్ఎంసీ ప్రణాళికలు వేయడం గమనార్హం. ప్రాథమిక అంచనా ప్రకారం వర్షాల కారణంగా 523.6 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 445 రూట్లలో 146.78 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 1,211 రూట్లలోని 376.58 కిలోమీటర్ల సీసీ రోడ్లు దెబ్బతిన్నట్టు బల్దియా అధికారులు గుర్తించారు. మరమ్మతుల కోసం బీటీ రోడ్లకు రూ.146 కోట్లు, సీసీ రోడ్లకు రూ.376 కోట్లు మొత్తం రూ.522 కోట్లు జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్ల మరమ్మతులు చేసేందుకు అవసరమవుతాయని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన రెండు రకాల రోడ్లను కలిపినా కిలోమీటర్ రోడ్ మరమ్మతులకు రూ.99.7 లక్షలు ఖర్చు అవసరమని జీహెచ్ఎంసీ నిర్ధారించింది.
గ్రేటర్‌లో రోడ్లు వేసేందుకు ప్రత్యేకంగా హెచ్ఆర్‌డీసీఎల్ ఏర్పాటు చేశారు. తర్వాత ప్రైవేటు ఏజెన్సీలకు పనులు అప్పజెప్పినా పెద్దగా మార్పు కనిపించడం లేదు. నగరంలో కనీసం పది కిలోమీటర్ల వరకైనా సాఫీగా సాగుతామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించలేక పోతున్నారు. గుంతలు, రోడ్ల కట్టింగ్స్‌తో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడిన ప్రభుత్వ యంత్రాంగాలే ఈ రోడ్లు అధ్వాన స్థితికి కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత భారీ వర్షాలు వచ్చినపుడు రోడ్లు కొట్టుకుపోతాయంటూ జీహెచ్ఎంసీ అధికారులు సర్దిచెప్పుకుంటున్నారు. వర్షాలు, వాహనాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే రోడ్ల నిర్మాణం చేపడుతారు. అయినా ప్రకృతి మీద నెపం మోపి తమ నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు.
నిబంధనలకు తిలోదకాలు..
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం అర్బన్ ఏరియాల్లో బీటీ రోడ్డు 10-15 ఏండ్లు, సీసీ రోడ్లు 20 ఏండ్లు మన్నికగా ఉండాలి. అందుకు అనుగుణంగానే రోడ్ల డిజైనింగ్‌తో పాటు మెటీరియల్‌ను వినియోగిస్తారు. అర్బన్ ఏరియాల్లో రోడ్లు వేసేటపుడు ప్రతిరోజూ 24 గంటల చొప్పున వారం రోజుల పాటు ఆ రూట్‌లో ఉండే ట్రాఫిక్ గణాంకాలను పరిగణనలోకి తీసుకుని రోడ్లు వేయాల్సి ఉంటుంది. అప్పుడే రోడ్లు తొందరగా దెబ్బతినకుండా నాణ్యమైన రోడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. నిర్దేశిత కాల వ్యవధిలోపు రోడ్డు మరమ్మతులు, మెయింటెనెన్స్ వచ్చినా అంతా కాంట్రాక్టరే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ బల్దియాకు తెలిసినా మళ్లీ జీహెచ్ఎంసీనే నిధులు కేటాయించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తోంది. ప్రస్తుతం వేస్తున్న రోడ్ల నాణ్యతను కనీసం పరిశీలించేందుకు కూడా వ్యవస్థలు సిద్ధంగా లేవు. ఇప్పుడు గ్రేటర్ రోడ్ల మరమ్మతులు కాంట్రాక్టర్లకు కాసులు కురిపించే కార్యక్రమంగా మారిపోయింది. ప్రజలు మాత్రం నాణ్యత లోపాల కారణంగా, గుంతల రోడ్లపై ప్రమాదాల బారిన పడుతున్నారు.