వైఎస్సార్ సంస్మరణ సభ.. రాజకీయ వేదిక కానుందా..?

by Anukaran |   ( Updated:2021-08-30 21:49:41.0  )
YS Vijayamma
X

దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 12వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజ‌యమ్మ హైద‌రాబాద్ వేదిక‌గా సంస్మరణ స‌భను నిర్వహించనున్నారు. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రాజ‌కీయ పార్టీల‌కతీతంగా కీలక నేతలు, వైఎస్ సన్నిహితులు, వీరాభిమానులను ఈ సభకు రావాల్సిందిగా ఆహ్వానం పంపిస్తున్నారు. వైఎస్సార్‌కు సంబంధించి జయంతి, వర్ధంతి, ఇతర ఏ కార్యక్రమమైనా పులివెందుల నుంచే ప్రారంభించేవారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఇడుపులపాయలో నివాళులర్పించిన అనంతరం హైదరాబాద్‌లో సంస్మరణ సభ నిర్వహించడం ఎవరి ప్రయోజనాల కోసం అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రతి ఏటా వైఎస్సార్ జయంతి, వర్ధంతికి ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లి ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పిండం ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి మొన్నటి వైఎస్సార్ జయంతి సందర్భంగా బ్రేక్ పడింది. అన్నా చెల్లెల్లిద్దరూ వేర్వేరుగా వచ్చి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అయితే ఈసారి వర్ధంతికి కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు వేర్వేరు సమయాల్లోనే వచ్చి నివాళులర్పించనున్నట్లు సమాచారం.

పదకొండేళ్లుగా లేనిది విజయమ్మ ఇప్పుడే ఎందుకు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్ కోసమే విజయమ్మ ఈ సభ పెడుతున్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టేది లేదని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి అనుకున్న స్థాయిలో ఆదరణ రాకపోవడం వల్లే ఈ సభను నిర్వహిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. తన పార్టీలో వైఎస్సార్‌తో సన్నిహిత సంబంధాలున్న నేతలు చేరతారని షర్మిల భావించినప్పటికీ అవేవీ జరగలేదు. అందుకే స్వయంగా విజయమ్మను ఆమె రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఈ సంస్మరణ సభ ద్వారా వచ్చిన అవకాశాన్ని షర్మిల పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

వైఎస్ విజ‌య‌మ్మ ఆహ్వానం అందుకున్న వారిలో వైఎస్సార్ ఆత్మగా పేరొందిన‌ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, పీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, మరికొంతమంది కీలకనేతలున్నారు. వీరంతా పలు పార్టీల్లో కీలకంగా వ్వవహరిస్తున్నారు. అయితే ఈ సంస్మరణ సభ ఆహ్వానం అందుకున్నవారిలో ఎంతమంది హాజరవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో నిర్వహించే వైఎస్సార్ సంస్మరణ సభకు తన కొడుకు, ఏపీ సీఎం జగన్‌తో పాటు వైఎస్ కుటుంబీకులంతా ఉండాలని చెప్పినట్లు సమాచారం. రాజ‌కీయంగా ఇద్దరి మధ్య ఉన్న వైరాన్ని ప‌క్కనపెట్టి తండ్రి సంస్మరణ స‌భ‌కు హాజ‌రుకావాల్సిందేన‌ని తన ఇద్దరు బిడ్డలకు విజ‌య‌మ్మ సూచించిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed