పల్నాడు రణరంగం.. చంపుకుంటారా?

by srinivas |
పల్నాడు రణరంగం.. చంపుకుంటారా?
X

స్థానిక సంస్థల ఎన్నికలు పల్నాడులో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఎళ్ల పగ, ప్రతీకారాలు నిద్రలేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సవాళ్లు ప్రతిసవాళ్లు, వాగ్వాదాలకు పరిమితమైన విమర్శలు ఇప్పుడు భౌతికదాడులకు ఊపిరిపోసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా మాచర్లలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. కారుప్రయాణం కూడా సురక్షితం కాదేమోనన్న ఆందోళనరేకెత్తిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేసే సమయంలో గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్రఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. మాచర్లలో టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేయడాన్ని వైఎస్సార్సీపీ వర్గాలు అడ్డుకుంటున్నాయన్న ఆరోపణలను నిర్ధారించుకునేందుకు టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్నలు మద్దతుదారులతో అక్కడికి చేరుకున్నారు. వారు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో వైఎస్సార్సీపీ నేతలు మాచర్లలో వారి కారుపై దాడికి దిగారు.

పెద్ద ఆయుధంతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. దానితోనే కారులోని వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కారులోని న్యాయవాది కిశోర్ తలకు గాయమైంది. దాడిని గుర్తించిన కారు డ్రైవర్ మరింత వేగంగా మార్కాపురం వైపు పోనిచ్చి దాడిని తప్పించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో మీడియా, సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో పల్నాడులో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది.

దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం చంపుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ రకమైన తీరు గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్‌లో ఉందని వినేవాళ్లమని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో రాష్ట్రం పరువు మంటగలిసిపోయే ప్రమాదం ఉందని, ఆదిలోనే ఇటువంటి చర్యలకు చరమగీతం పాడాలని సూచిస్తున్నారు.

Tags: tdp, ysrcp, guntur, macherla, car attacked, political attacks, local body elections

Advertisement

Next Story