షర్మిల పార్టీలో లుకలుకలు.. కీలక నేతల్లో వర్గపోరు

by Shyam |   ( Updated:2021-07-24 11:58:50.0  )
YS-Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వమే ఎజెండాగా వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీలోనే సమన్యాయం జరగడం లేదనే వాదనలు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ స్థాపించి రెండు వారాలు కూడా కాలేదు అప్పడే పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. తమకు ప్రాధాన్యత దక్కడం లేదని, తమతో వచ్చిన నేతలపై సైతం చిన్నచూపు చూస్తున్నారని నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా పార్టీకి అధికార ప్రతినిధులుగా కొనసాగుతున్న కొండా రాఘవరెడ్డి, ఇందిరాశోభన్ మధ్య వర్గపోరు మరింత ఎక్కువైనట్లుగా కనిపిస్తోంది. ఇటీవల వీరు లోటస్ పాండ్‌లోనే పరస్పరం దూషించుకునే స్థాయికి పరిస్థితి మారినట్లుగా తెలుస్తోంది. దీంతో పార్టీలో ఉండేదెవరో? పోయేదెవరో అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

కొండా రాఘవరెడ్డి వర్సెస్ ఇందిరాశోభన్

కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్న ఇందిరాశోభన్.. అక్కడ తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని కాంగ్రెస్‌కు హ్యాండిచ్చింది. వైఎస్సార్ తనయ షర్మిల పార్టీ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఆమెకు దగ్గరైంది. వెంటనే షర్మిల పార్టీలోకి చేరింది. ఆనాటి నుంచి ప్రతీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తమ వర్గానికి చెందిన నాయకులకు సరైన ప్రాధాన్యత కల్పించలేదనే అంశంలో ఇందిరాశోభన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డికి, ఆమెకు మధ్య వివాదం జరిగినట్లు సమాచారం. అసలు ఇందిరాశోభన్ పార్టీలోకి ఎంతమందిని చేర్చింది, వైఎస్సార్ సీపీ నేతల చేరికలను కూడా తన ఖాతాలో వేసుకుంటే ఎలా అని కొండా రాఘవరెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. అయితే వైఎస్సార్ టీపీలో చేరిన వైఎస్ అభిమానులు, వైసీపీ నేతలు ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యం కల్పించకుండా అడ్డుకుంటున్నారని ఇందిరాశోభన్ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈవిషయంలో వీరిరువురు లోటస్ పాండ్‌లోనే పరస్పర దూషణలకు దిగినట్లు సమాచారం.

కాంగ్రెస్ గూటికి చేరేందుకేనా?

అయితే ఈ పరస్పర దూషణలు ఇందిరాశోభన్ తిరిగి సొంత గూటికి చేరేందుకేనా అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. దీనికి తోడు పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకమయ్యాక కాంగ్రెస్ నుంచి తనుకు ఫోన్ కాల్స్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె త్వరలోనే పార్టీ మారే అవకాశాలున్నాయని వార్తలొచ్చినా వైఎస్సార్ టీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసింది. అయినా నేటికీ కూడా ఆ ఊహాగానాలకు తెరపడకపోవడం గమనార్హం. వైఎస్సార్ టీపీ నేతలు సైతం ఆమె కదలికలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పార్టీలోనే ఉంటుందా? వెళ్లిపోతుందా? అని ఎవరూ రూఢీ చేయకపోయినా పక్కాగా ఆమె త్వరలోనే పార్టీని విడిచిపెట్టాలనే ఆలోచనలో ఉందంటున్నారు. వైఎస్సార్ టీపీలో ఎదుగుదల లేదనుకుందో, భవిష్యత్ లేదనుకుందో కానీ ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లాలనే ఆలోచనలో పడినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా అయ్యాక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం మరింత ఎక్కువైంది. ఈ అంశాలకు తోడు షర్మిల నిరుద్యోగులకు భరోసా కల్పించాలని ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసిన సందర్భంలో గాడిదలు కాస్తున్నారా? అని దూషించడం, లోటస్ పాండ్‌లో తనస్థాయిని తగ్గించినట్లుగా మాట్లాడుతున్న పలు అంశాలు కూడా పార్టీ మారేందుకు అవకాశం కావొచ్చని రాజకీయ వర్గాల్లో టాక్.

‘ఏపూరి’పైనా ఆరోపణలు

పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకమయ్యాక ఏపూరి సోమన్న సైతం పార్టీ మారుతారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం వెళ్లేందుకు సుముఖంగా లేడని తెలుస్తోంది. ఇందుకూ కారణాలు లేకపోలేదు. అక్కడి వెళ్లినా తనను పాట పాడే కళాకారుడిగానే గుర్తిస్తారని, నాయకుడిగా గుర్తించరనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ ఉంటుందని, అదే వైఎస్సార్ టీపీలో అయితే తనకు ఆ ఇబ్బంది ఉండదనే భావనలో ఏపూరి ఉన్నట్లుసమాచారం. అయితే ఇటీవల నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో షర్మిల ప్రత్యేకించి ఇందిరాశోభన్, ఏపూరి సోమన్న గురించి ప్రస్తావించారు. వీరు అధికారం కోసమో, ఆస్తులు కాపాడుకోవడానికో వచ్చిన నాయకులు కాదని, జంపింగ్ జపాంగ్‌లు తమ పార్టీకి అవసరం లేదన్నారు. వీరిని నిఖార్సయిన నాయకులని పొగడ్తల్లో ముంచేశారు. మరి పార్టీ మారుతారా? మారరా అనే అంశంపై ఇందిరాశోభన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story