ఏప్రిల్ 9న ముహూర్తం.. షర్మిల పార్టీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ!

by Shyam |
ఏప్రిల్ 9న ముహూర్తం.. షర్మిల పార్టీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీపై వచ్చే నెల 9న స్పష్టత రానుంది. పార్టీ పేరు, జెండా, ఎజెండా, విధి విధానాలు తదితరాలన్నింటిపై కసరత్తు చేస్తున్న షర్మిల ఎప్పుడు ప్రకటించబోయేది ఏప్రిల్ 9వ తేదీన ప్రజల సమక్షంలో వెల్లడించనున్నారు. ఇప్పటికే విడతల వారీగా నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, వెఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తికాగా ఈ నెల 19వ తేదీన కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించింది ఏప్రిల్ 9న కావడంతో ఆ తేదీనే పార్టీ సన్నాహకాలపై ప్రకటన చేయనున్నారు. ఆ రోజుతో వైఎస్సార్ పాదయాత్ర చేపట్టి 18 ఏళ్లు పూర్తవుతుంది. వైఎస్ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన పార్టీ పేరు, ఇతర అంశాలను స్వయంగా ఆమె ప్రజలకు బహిర్గతం చేయవచ్చని ఆమె సన్నిహితుల సమాచారం.

సమ్మేళనాలు, సమావేశాలతో బిజీబిజీ..

కొద్ది రోజులుగా పలు జిల్లాల నాయకులు, వెఎస్సార్ అభిమానులతో సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తూ షర్మిల బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవి పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించడం లేదని షర్మిలకు తమ గోడును చెప్పుకునేందుకు లోటస్ పాండ్‌కు వస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అటు నాయకులు, అభిమానులతో సమావేశాలు, ఇటు ప్రజల సమస్యలను వింటూ వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తూ సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీ ఏర్పాటుకు రూపమిస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేస్తే తాము చేయబోయే పనులను కూడా గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు మండల కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఒక్కో మండలానికి ముగ్గురు సభ్యలకు బాధ్యతలను అప్పగించనున్నారు.

పార్టీ పేరులో వైఎస్సార్, తెలంగాణ అనే పదాలు తప్పకుండా ఉంటాయని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. ఏప్రిల్ 9వ తేదీకల్లా అన్ని జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. భారీ సంఖ్యలో జిల్లాల నుంచి అభిమానులు, కార్యకర్తలు వస్తున్నందున నగరంలో పార్టీ కోసం కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అవసరాన్ని బట్టి కొన్ని జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలను నగరంలో కాకుండా అభిమానులకు దగ్గరుండే పట్టణాల్లోనే నిర్వహించాలనుకుంటున్నారు. అన్ని జిల్లాల మీటింగుల తర్వాత పార్టీ లక్ష్యాన్ని, ప్రజలకు చేరువయ్యే అంశాలను ఎంపిక చేసి పార్టీ ఎజెండాలో చేర్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల్లో అసంతృప్తులతో ఉన్న వివిధ స్థాయిల్లోని నాయకులను షర్మిల తన పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టిపెట్టారు. ఏప్రిల్ 9వ తేదీన ఆమె చేయబోయే ప్రసంగం మీదే అందరి దృష్టి ఉంది.

Advertisement

Next Story

Most Viewed