- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ డాక్యుమెంటరీ ఆన్ ‘మై విలేజ్ షో’
దిశ, ఫీచర్స్ : తెలంగాణ యాస భాషలు, పల్లె అందాల మట్టి పరిమళాలను వెదజల్లుతూ.. ఇంటర్నెట్‌కు దూరంగా బతికే ‘లంబాడిపల్లె’లో ప్రారంభమైన ‘మై విలేజ్ షో’ చానల్.. యూట్యూబ్ వేదికపై సగర్వంగా రెపరెపలాడుతోంది. తెలుగు నెటిజన్‌కే సొంతమనుకున్న ఆ చానల్ ఖ్యాతి, ఈ రోజు విశ్వవ్యాప్తమైంది. ‘మై విలేజ్ షో’ సక్సెస్‌పై డాక్యుమెంటరీ తీయడానికి స్వయంగా యూట్యూబ్ టీమ్ ఆ పల్లెను వెతుక్కుంటూ వచ్చింది. తన గ్రామాన్ని, అక్కడి ప్రజా జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే తపనతో మొదలైన శ్రీరామ్ శ్రీకాంత్ ఆలోచన నేడు నిజమైంది. సిటీ లైఫ్‌ను, ఉద్యోగ అవకాశాన్ని వదిలి పల్లెబాట పట్టిన ఆ యువకుడు.. తనతో పాటు పుట్టిన ఊరిని సైతం ప్రపంచ పటంలో నిలిపాడు. ఇప్పుడు ఆ పల్లెనే కళాకారుల కార్ఖానాగా మార్చుతున్నాడు. గంగవ్వ, అనిల్ జీల, అంజిమామ, రాజు, శివకృష్ణ, చందు ఈ చానల్ ద్వారా పరిచయం కాగా.. అద్వితీయమైన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరియర్‌లో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా లంబాడిపల్లె యూట్యూబ్ ధీరులపై స్పెషల్ స్టోరీ.
పల్లెల్లోని చమత్కారం, అక్కడి మనుషుల్లోని అమాయకత్వం.. ప్రేమ నిండిన పలకరింపులు, పరాచకాలు, పండుగ పబ్బాలు, సంప్రదాయాలతో పాటు రోజువారీ జీవితంతో ముడిపడిన సంఘటనలే ముడిసరుకుగా రూపొందిన చానల్ ‘మై విలేజ్ షో’. మట్టిగోడలు, పూరి గుడిసెలు, పెంకుటిళ్లు, పొలం గట్లు, చెట్టు చేమ, గొడ్డు గోద కూడా ఇందులో పాత్రధారులే. అప్పటివరకు యూట్యూబ్‌లో ఈ తరహా కంటెంట్ లేకపోవడం, అందరికీ భిన్నంగా ప్రయత్నించడమే ఈ చానల్‌ను భిన్నంగా నిలిపాయి. నిజానికి ఇంటర్నెట్ ప్రపంచం కొంతమందికి రెడ్‌కార్పెట్ పరిస్తే, మరికొంతమందికి అదృష్టం కలిసి రాకపోవచ్చు. కానీ అభిరుచితో పాటు హార్డ్‌వర్క్‌ను నమ్ముకుంటే సంచలనాలకు మారుపేరుగా నిలవచ్చని నిరూపించింది ‘మై విలేజ్ షో’. పదుల సంఖ్యలో కొత్త చానల్స్ పుట్టుకురావడానికి, వందలాది యువత ఈ వైపు అడుగులు వేయడానికి ఈ చానల్ సక్సెస్ స్ఫూర్తిగా నిలిచిందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఒక్కడి ఆలోచనతో.. నలుగురు వ్యక్తుల సాక్షిగా, నలభై మంది సబ్‌స్క్రైబర్లతో 2012లో ప్రారంభమైన ‘మై విలేజ్ షో’.. అప్రతిహతంగా సాగుతూ 2.2 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.
ఎలా మొదలైంది?
శ్రీకాంత్ బీటెక్ పూర్తిచేసిన తర్వాత తన తండ్రితో కలిసి ‘మేల్‌కొలుపు’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. పారిశుధ్యం, మరుగుదొడ్లు, విద్య వంటి సాధారణ సమస్యలపై తండ్రీకొడుకులు పాటలు రాసి, తామే కంపోజ్ చేసి అప్‌లోడ్ చేసేవారు. ఐప్యాడ్‌తోనే పాటలు, వీడియోలు రికార్డ్ చేసేవారు. ఈ క్రమంలో గ్రామ సమస్యలపై వ్లాగ్స్ చేయడం ప్రారంభించిన శ్రీకాంత్.. ఆ తర్వాత చానల్ వదిలేసి ఎంటెక్ కంప్లీట్ చేశాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఓ ఏడాది పాటు ఉద్యోగం చేసిన అతను.. ఫిల్మ్ మేకింగ్ చేయాలనే కోరిక, పల్లె మీదున్న అభిమానంతో ఉద్యోగానికి రాజీనామా చేసి లంబాడిపల్లెకు తిరిగొచ్చాడు. కొత్తగా కెమెరాలు, కంప్యూటర్ కొని తన పాత చానల్ పేరును ‘మై విలేజ్ షో’గా మార్చి అనేక వీడియోలు రూపొందించాడు. అయితే గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం 2017లో ‘కికి చాలెంజ్’ వీడియోనే. తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశీయుల హృదయాలను గెలుచుకున్న అనేక వీడియోల్లో ‘కికి చాలెంజ్’ ఒకటి. ఈ నేపథ్యంలో ఒకే రోజులో లక్షమంది సబ్‌స్కైబర్స్ సాధించిన ‘మైవిలేజ్ షో’ చానల్.. ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్థానికంగా చేసిన ఇంటర్వ్యూలతో శ్రీకాంత్, అనిల్ పేర్లు మారుమోగిపోయాయి. ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థలు కూడా వీరి ప్రతిభను గుర్తించడం విశేషం.
యూనిటీ స్పిరిట్ :
మై విలేజ్ షో బృందంలో తొలిగా ఎనిమిది మంది సభ్యులు ఉండగా, ఆ సంఖ్య పెరుగుతోంది. లంబాడిపల్లె కళాకారులకు ‘మై విలేజ్ షో’ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ సెలక్షన్, కెమెరా, ఎడిటింగ్, సోషల్ మీడియా హ్యాండిల్స్ నిర్వహించడం ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదు. టీమ్ వర్క్‌తోనే మై విలేజ్ షో తన విజయపరంపర కొనసాగిస్తోంది. వ్యక్తిగత ప్రతిభకు మరింత మెరుగులు దిద్దడం ఈ టీమ్ సక్సెస్‌కు మరో కారణం. అందువల్లే ప్రస్తుతం ఆ టీమ్‌లోని ‘గంగవ్వ, అంజిమామ, అనిల్ జీల’లు వ్యక్తిగత యూట్యూబ్ చానల్స్‌తోనూ సత్తా చాటుతున్నారు. అంతేకాదు తమ గ్రామానికి రోడ్లు సరిగా లేవనే విషయాన్ని చాలా ఫన్నీ వేలో ప్రజెంట్ చేయగా, వెంటనే రోడ్ శాంక్షన్ చేయించిన ఎంపీ వినోద్ కుమార్.. టీమ్ సభ్యుల్ని స్వయంగా అభినందించాడు. కాగా చానల్‌తో వచ్చిన ఆదాయంతో విలేజ్‌లో లైబ్రరీ, గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా వీరి ప్రతిభను గుర్తించింది. టాలీవుడ్ స్టార్లు, బిగ్‌బాస్ సెలబ్రిటీలు సైతం తమ సినిమాల ప్రమోషన్స్ కోసం ఈ టీమ్‌ను ఉపయోగించుకోవడం విశేషం.
ది స్టార్ గంగవ్వ :
మై విలేజ్ షోకు సెంటరాఫ్ అట్రాక్షన్ ‘గంగవ్వే’. తన సహజ నటనతో అందరిని నవ్విస్తున్న ఆ మహానటి.. పొలం పనుల నుంచి బిగ్‌బాస్ అవకాశాన్ని దక్కించుకోవడం వరకు సాగించిన జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకం. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకున్న అవ్వ.. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా వస్తున్న ‘రాజ రాజ చోర’ గాథను తన వాయిస్‌తో ఇంట్రడ్యూస్ చేసింది. ఇక గంగవ్వ యూట్యూబ్ చానల్‌కు 3లక్షల పైగా సబ్‌స్కైబర్స్ ఉండగా.. సొంతింటి కలను కూడా త్వరలో నిజం చేసుకోబోతుంది ఈ యూట్యూబ్ స్టార్.
అనిల్ జీల :
గణిత ఉపాధ్యాయుడైన అనిల్ ఈ చానల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవలే ఓ ఇంటివాడైన ఈ యూట్యూబర్.. తన సొంత చానల్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. ఆ చానల్‌కు ఆరున్నర లక్షల సబ్‌స్కైబర్స్ ఉండగా, తెలంగాణ నుడికారంలో అచ్చేసిన అతడి పెళ్లి కార్డు ఇంటర్నెట్ ట్రెండింగ్‌లో నిలిచిన విషయం తెలిసిందే. తన కామెడీ, నటనతో యావత్ వీక్షకుల అభిమానం గెలుచుకున్న అనిల్.. విజయ్ దేవరకొండ చిత్రంలో మంచి పాత్రను దక్కించుకున్నాడు.
అంజిమామ :
కామెడీ టైమింగ్‌తోనే కాదు, వంటలు చేయడంలోనూ ప్రత్యేకత చాటే అంజిమామ.. తన పాకప్రావీణ్యాన్ని వీక్షకులకు అందించడానికి ‘కల్లివెల్లి’ చానల్ ప్రారంభించాడు. రెండున్నర లక్షల సబ్‌స్కైబర్స్‌కు చేరువలో ఉన్న అంజిమామ తెలంగాణ స్పెషల్ డిషెస్‌ను పరిచయం చేస్తున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఓ సిరీస్‌లో నటించగా, మరెన్నో అవకాశాలు ఆయన తలుపుతడుతున్నాయి.
యాక్టర్ కమ్ రైటర్ శివకృష్ణ :
‘పల్లె ప్రజలకు ఏమీ తెలియదని, నిరక్షరాస్యులని, కల్చర్ గురించి ఐడియా ఉండదనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ జనాలు వదిలేస్తున్న కల్చర్‌ను మేం రిప్రజెంట్ చేస్తూ ముందుకు సాగుతున్నాం. బంధుత్వాలను, సంస్కృతిని, పల్లెపదాలను తర్వాతి తరాలకు అందించడమే మా చానల్ ప్రత్యేకత’
‘ఫిల్మ్‌మేకర్‌గా రాణించాలన్నదే నా ఆశయం. ముందు మా పల్లెను గ్లోబల్‌గా పరిచయం చేయాలనుకున్నా. అదేవిధంగా ఊళ్లోని యువతకు ఉపాధి ఇవ్వచ్చనే ఆలోచనతో యూట్యూబ్ చానల్ ప్రారంభించా. యూట్యూబ్ వీడియోలు, ఆన్‌లైన్ కోర్సుల ద్వారా నా మేకింగ్‌ను తీర్చిదిద్దుకున్నా. 2016లో మా గ్రామానికి వచ్చి, రాజుతో కలిసి వీడియోలు తీయడం ప్రారంభించాను. రాజు, గంగవ్వతో చేసిన ‘విలేజ్‌లో నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్స్’ పేరుతో చేసిన వీడియో వైరల్ అయింది. నాటి నుంచి సక్సెస్ బాటపట్టిన మా చానల్‌లో ప్రస్తుతం 15 మంది పనిచేస్తున్నారు. మా ప్రతి వీడియోలో ఇన్నర్‌గా ఓ మెసేజ్ ఉంటుంది. సోషల్ ఇష్యూస్‌పై కూడా చర్చిస్తాం. మా చానల్‌ను గ్రామ ఆధారిత స్టార్టప్‌గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఆ బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఆసక్తిగల గ్రామస్తులకు కంప్యూటర్ బేసిక్స్, ఫిల్మ్‌మేకింగ్‌పై శిక్షణ ఇవ్వడంతో పాటు గ్రామానికి చెందిన రైతుల కోసం ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయనున్నాం. డైరెక్టర్ శంకర్ సినిమాలే నన్ను ఈ దిశగా నడిపించగా.. 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఫ్యూచర్‌లో మంచి ఫీచర్ ఫిల్మ్స్ తీయడమే మా లక్ష్యం. – శ్రీకాంత్, దర్శకుడు