వ్యాక్సిన్ కోసం భారీగా రిజిస్ట్రేషన్.. తొలిరోజు ఎంతంటే?

by vinod kumar |
Covin Portal‌
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ పంపిణీయే ఏకైక మార్గమని ప్రభుత్వాలు భావిస్తు్న్న తరుణంలో 18 ఏళ్లు పైబడినవారికి టీకాలు అందజేసేందుకు ఉద్దేశించిన టీకా నమోదు కార్యక్రమానికి తొలిరోజే భారీ తాకిడి తగిలింది. మొదటిరోజు తొలి మూడు గంటల్లోనే సుమారు 80 లక్షలకు పైగా మంది వయోజనులు కొవిన్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇంత మంది ఒకేసారి వెబ్ పోర్టల్‌ను ఓపెన్ చేయడంతో కొవిన్, ఆరోగ్య సేతు యాప్‌ల సర్వర్లు మొరాయించాయి. దీంతో టీకా నమోదు కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు ఎదురైనా తర్వాత దానిని పరిష్కరించడంతో నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్.ఎస్.శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. తొలిరోజు 79,65,720 మంది కొవిన్ లో నమోదు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూడో దశ టీకా పంపిణీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడినవారికీ వ్యాక్సిన్ అందించడానికి నిర్ణయించిన విషయం విదితమే.

మొరాయించిన సర్వర్లు..

బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు లాగిన్ అయ్యారు. దీంతో సైట్ పై లోడ్ ఎక్కువవడంతో సర్వర్లు కాసేపు మొరాయించాయి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన ఆదిలోనే.. అది నిలిచిపోయింది. పోర్టల్‌ క్రాష్ అవడంతో యువకులు సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రాష్ అయిన స్క్రీన్ షాట్లను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు. అయితే కొద్దిసేపటి తర్వాత సమస్యను పరిష్కరించిన అధికారులు.. సైట్ క్లీయర్ అయిందని చెప్పడంతో తిరిగి నమోదు ప్రక్రియ సాఫీగా సాగింది.

క్లిక్కులే క్లిక్కులు..

దేశవ్యాప్తంగా కొవిడ్-19 తీవ్రత కొనసాగుతుండటం.. వ్యాక్సిన్ మీద అవగాహన పెరగడంతో దానిని సకాలంలో వేయించుకోవడానికి యువత ఆసక్తి చూపింది. కొవిన్ పోర్టల్ ప్రారంభమైన కొద్దిసేపటికే.. నిమిషానికి 27 లక్షల మంది దానిని క్లిక్ చేశారు. దీంతోనే పోర్టల్ ఓపెన్ అయిన కొద్దిసేపటిదాకా అది క్రాష్ అయింది. ఒక్క సెకండుకు 55 వేల మంది పోర్టల్ ఓపెన్ చేశారని ఆర్.ఎస్. శర్మ తెలిపారు.

45+ వాళ్లకే…

కొవిన్ పోర్టల్‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైనా అందులో స్లాట్ బుక్ కావడం లేదని నెటిజన్లు ఆరోపించారు. 45 ఏళ్లు నిండినవారికే స్లాట్ బుక్ అవుతుందని, తమకు కావడం లేదని ట్విట్టర్ లో ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాతే స్లాట్ బుక్ అవుతుందని ఆరోగ్య సేతు యాప్ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed