మాటకు కట్టుబడిన ప్రియుడు.. అంత్యక్రియల రోజే ప్రియురాలి ఎంగేజ్‌మెంట్!

by Sumithra |
love-marrige -1
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ.. ఇద్దరి జీవితాల్లో ఆనందం పంచాల్సింది పోయి ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. లవ్ కోసం పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడానికి కొందరు ధైర్యం చేస్తుంటే.. మరికొందరు మాత్రం జీవితాంతం ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇంకొన్ని ఘటనల్లో ప్రేమ కోసం ఒకరినొకరు చంపుకోవడానికి సైతం వెనుకాడట్లేదు. అయితే, తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే కారణంతో ప్రేమికులిద్దరూ చనిపోదామని నిర్ణయించుకున్నారు. ప్రియురాలి కోరింది కదా అని ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా.. అతని అంత్యక్రియల రోజే ప్రియురాలు మరొకరితో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధపడింది. ఈ వింత ఘటన వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం కిష్టాపూర్‌లో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ప్రేమ వ్యవహారంలో వినయ్(23) గత నెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత వినయ్ మొబైల్ ను పరిశీలించిన కుటుంబసభ్యులు అతని మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు.

ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా ఓ యువతితో వినయ్ కొన్నిరోజులుగా ప్రేమలో ఉన్నట్లు గుర్తించారు. పెళ్లికి తమ కుటుంబసభ్యులు అంగీకరించరని, ఇద్దరం కలిసి చనిపోదామంటూ యువకుడితో యువతి చాట్ చేసిన సంభాషణను పోలీసులు గుర్తించారు. తీరా చూస్తే వినయ్ తన ప్రియురాలి మాటలు విని పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా, అతని అంత్యక్రియల రోజే ఆ అమ్మాయి వేరే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ కేసులో యువతి ప్రోత్సాహం వల్లే వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత కుటుంబం ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Next Story

Most Viewed