సీఎం కేసీఆర్‌కు వైద్యులు ఏం చెప్పారంటే..?

by Shyam |   ( Updated:2021-01-07 08:03:17.0  )
సీఎం కేసీఆర్‌కు వైద్యులు ఏం చెప్పారంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో మంట వస్తోందంటూ వైద్య పరీక్షలు చేయించుకోడానికి గురువారం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి వెళ్ళారు. సీటీ స్కాన్ సహా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఐదు రోజులకు సరిపోయేలా వాడాల్సిన మందులు ఇచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కొద్దిసేపు ఆసుపత్రిలోనే వైద్య పరీక్షల నిమిత్తం ఉండిపోయిన కేసీఆర్ వెంట ఆయన కుమారుడు కేటీఆర్, సన్నిహితుడు ఎంపీ సంతోష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సీటీ స్కాన్ సహా కొన్ని రక్తపరీక్షల రిపోర్టులు శుక్రవారం వస్తాయని వైద్యులు పేర్కొన్నారు.

కేసీఆర్ అనారోగ్య పరిస్థితి గురించి ఆయన వ్యక్తిగత వైద్యుడైన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీరావు మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ ఏటా శీతాకాలం సీజన్‌లో స్వల్పంగా శ్వాసకోస సమస్యలు వస్తుంటాయని, ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటూ ఉంటారని, ఈసారి కూడా అలాంటి రోటీన్ టెస్టులే చేశామని వివరించారు. ఆయన ఆరోగ్యానికేం ఢోకా లేదని, బాగున్నారని, ఊపిరితిత్తుల్లో కాస్త మంటగా ఉందంటూ చెప్పినందున కారణాలను శోధించడానికి అవసరమైన సీటీ స్కాన్, రక్త పరీక్షలు చేశామని తెలిపారు. శుక్రవారం వచ్చే రిపోర్టుకు అనుగుణంగా చికిత్సపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి ఐదు రోజుల వరకు మందులతోనే సరిపోతుందని పేర్కొన్నారు.

ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్‌ఫెక్షన్ ఉందని, కొన్ని రక్త పరీక్షలతో పాటు 2-డీ ఎకో రిపోర్టు రావాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్ గత కొంతకాలంలో బ్రాంకైటిస్ సమస్యతో బాధపడుతున్నారని, శీతాకాలంలో వచ్చే వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారని, ఇప్పుడు వచ్చిన సమస్య కూడా ఆ కోవలోనిదేనని వివరించారు. అంతకుమించి ఇతర అనారోగ్య సమస్యలేవీ లేవని, మందులు వాడుతూ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ సూచనలతో యశోద ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. తొలుత ఆసుపత్రిలో అడ్మిషన్ చేస్తే బాగుంటుందని వైద్యులు సూచించినా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటానని చెప్పడంతో పరీక్షల అనంతరం పంపించినట్లు తెలిసింది.

సాధారణంగా స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఆనవాయితీ అయినా మీడియాకు, బైటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా అధికారికంగానే యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు, ఊపిరితిత్తుల్లో మంటగా ఉందంటూ వెల్లడించడం గమనార్హం. మీడియా ద్వారా మొత్తం తెలంగాణ సమాజానికి ఆయన తన అనారోగ్యం, వైద్య పరీక్షలు చేయించుకోవడం లాంటి అంశాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న అంశంపై స్వంత పార్టీలోనే చర్చలు మొదలయ్యాయి.

Advertisement

Next Story