యాదాద్రి నిర్మాణానికి మరో ఏడాది?

by Shyam |
యాదాద్రి నిర్మాణానికి మరో ఏడాది?
X

దిశ న‌ల్ల‌గొండ‌: కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు యాదాద్రికి బడ్జెట్‌లో పెద్ద‌పీట వేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేవాదాయ శాఖ‌కు రూ.500 కోట్లు కేటాయించినా అందులో సింహ‌భాగం యాదాద్రికే రూ.350 కోట్లు కేటాయించారు. కానీ, ఈ నిధులు ప‌నుల బకాయిల‌కే స‌రిపోతాయ‌ని భావిస్తున్నప్పటికీ ఆర్థిక మాంద్యంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.2 వేల కోట్ల ప్రణాళికలతో స్వ‌యంభూ ద‌ర్శ‌నం నాటికి రూ.1,200 కోట్లు సరిపోతాయని అంచనా వేసినా ఇప్ప‌టివ‌ర‌కు రూ.700 కోట్ల ప‌నులే పూర్తికావడం విశేషం.

3 నెలల క్రితమే యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించాలని భావించిన కేసీఆర్ సుదర్శన యాగం కూడా నిర్వహించాలనుకున్నారు. రుత్వికులు, వేద పండితులు, వైష్ణవ మఠాధిపతులు, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల సీఎంలు, వీవీఐపీలను ఆహ్వానించాలనుకొని డిసెంబర్ 17న యాదాద్రి టూర్‌కు వచ్చారు. కానీ 90 శాతం పనులే పూర్తి కావడం, చినజీయర్ స్వామి అందుబాటులో లేకపోవడంతో సుదర్శన యాగానికి బ్రేక్ వేశారు. ఆ రోజే వైటీడీఏ అధికారులతో స‌మీక్ష‌లో అసంపూర్తిగా నిలిచిపోయిన ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయ‌డానికి రూ.475 కోట్లు కేటాయించాల‌ని చెప్పారు. 15 రోజుల్లో నిధులు విడుద‌ల చేస్తాన‌ని వెళ్లిన సీఎం 3నెల‌ల తర్వాత బ‌డ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించారు.

అ సంపూర్తిగా పనులు

సీఎం కేసీఆర్ ఇప్పటివరకు 13 సార్లు యాదాద్రి వచ్చి పలుమార్లు డెడ్‌లైన్‌ విధించినా పనులు మాత్రం వేగంగా జరగడం లేదు. రూ. 1200 కోట్ల అంచ‌నాలతో ప్రారంభ‌మైన పనుల్లో రూ.200 కోట్లు పెద్దగుట్ట అభివృద్ధికి, ఆలయం, ఇత‌ర ప‌నులకు రూ. 500 కోట్లు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ పనులు చేసేవారికి బిల్లులు సరిగా చెల్లించడం లేదని తెలుస్తోంది. గర్భాలయంలో 90 శాతం పనులే పూర్తి కావడంతో ఇప్పటికీ మెరుగులు దిద్దుతున్నారు. కొండపై కొన్ని నిర్మాణాలను ఎక్కడ నుంచి ప్రారంభించాలో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొండ కింద రోడ్ల విస్తరణ, షాపులు, ఇండ్లు కోల్పోయేవారికి నష్ట పరిహారంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఆలయ నిర్మాణానికి మరో ఏడాది?

ప్రస్తుతం జరిగిన పనులకు మెరుగులు దిద్దడం, మిగిలిన పనులను పూర్తి చేయడానికి దాదాపు మరో ఏడాది పట్టే అవకాశముందని తెలుస్తోంది. అది కూడా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు బిల్లులు విడుదలైతేనే 2021 బ్రహ్మోత్సవాల వరకు పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు. మరోవైపు గర్భాలయం పనులు, ప్రహ్లాదుడి చరిత్ర చిత్రాలు ఏర్పాటు, విగ్రహాలకు నగీషీలు చెక్కడం, విద్యుద్దీకరణ పనులు, ఏసీ ఏర్పాటు, లిఫ్ట్ ఏర్పాటు, తిరుమాఢ వీధుల్లో ఫ్లోరింగ్ పనులు, శివాలయంలోనూ ప్లోరింగ్ పనులు, కొండపైకి మెట్ల మార్గం, పుణ్య స్నానాలకు పుష్కరిణి, ప్రసాదం తయారీ సెంటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రిటైనింగ్ వాల్ ఫినిషింగ్‌, కొండ కింద తెప్పోత్సవం కొరకు 33 ఎకరాల్లో గండి చెరువు పనులు, కొండ చుట్టూ రింగ్‌రోడ్డు, రోడ్ల విస్తరణ పనులు పూర్తి కావల్సి ఉంది. క్యూ కాంప్లెక్స్ , క‌ల్యాణకట్ట, సత్యనారాయణ వ్రత మండపాలు, అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు, నిత్యాన్నదాన సత్రం, కొండపై సబ్‌స్టేషన్, బస్టాండ్‌‌ నిర్మాణాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో భక్తుల్లో కొంత అసంతృప్తి నెలకొంది.

Tags: Yadadri Temple, Sudarshan Yagam, Cm KCR, YTDA, Cinajiyarsvami, Endowment

Advertisement

Next Story

Most Viewed