WTC FINAL: మిగిలింది రెండు రోజులే

by Shyam |
WTC FINAL: మిగిలింది రెండు రోజులే
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిన్‌ను వరుణుడు వదలడం లేదు. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో ఇండియా, న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్‌లో ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోగా.. అందులో రెండు రోజులు వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. తొలి రోజు, 4వ రోజు ఆటను పూర్తిగా రద్దు చేశారు. రెండవ రోజు వెలుతురు సమస్య కారణంగా 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమయ్యింది. ఇక మూడో రోజు టీమ్ ఇండియా 27.5 ఓవర్లు ఆడి 217 స్కోర్ వద్ద ఆలౌట్ అయ్యింది. ఇక న్యూజీలాండ్ జట్టు 49 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మూడో రోజు చివరి సెషన్‌లో డెవాన్ కాన్వే అవుటైన రెండు బంతుల తర్వాత వెలుతురు సరిగా లేకపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక నాలుగో రోజు ఉదయం నుంచి మరోసారి వర్షం ఆటకు ఆటంకం కలిగించింది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో తొలుత ఫస్ట్ సెషన్ రద్దు చేసినట్లు ప్రకటించారు. లంచ్ విరామం తర్వాత కూడా ఆటకు అనుకూలమైన పరిస్థితుల లేకపోవడంతో చివరకు నాలుగో రోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

రిజర్వ్ డేతో కలిపి రెండు రోజులే..

డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగడానికి చాలా రోజుల ముందే ఐసీసీ నిబంధనలు విడుదల చేసింది. ఏదైనా కారణాల వల్ల మ్యాచ్‌కు ఆటంకాలు కలిగితే.. ఆరో రోజు ఆ సమయాన్ని వినియోగించుకోవడానికి వీలుగా రిజర్వ్ డేను ప్రకటించింది. ఇప్పటికే రెండు రోజులకు పైగా సమయం ఆటకు అంతరాయం కలగడంతో జూన్ 23 రిజర్వ్ డేను కూడా ఉపయోగించుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే ఆ రెండు రోజులైనా వరుణుడు ఆటంకం కలిగించకుంటా ఉంటేనే ఫైనల్‌లో ఫలితం తెలిసే అవకాశం ఉంటుంది. నాలుగు రోజులు గడిచినా ఇంకా తొలి ఇన్నింగ్స్‌లే పూర్తి కాలేదు. న్యూజీలాండ్ జట్టు ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉన్నది. టెస్ట్ మ్యాచ్‌లో ఇంకా 6 సెషన్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్ ఫలితం తేలే అవకాశం కనపడటం లేదు. న్యూజీలాండ్ జట్టు రేపు రెండు సెషన్లలో ఆలౌట్ అయి.. తర్వాత ఇండియా రెండో ఇన్నింగ్స్ రెండు సెషన్ల పాటు ఆడి.. 250 పైగా లక్ష్యాన్ని ఉంచాలి. ఆ తర్వాత రెండు సెషన్లలో న్యూజీలాండ్‌ను ఓడిస్తే భారత జట్టు గెలుస్తుంది. అలా కాకుండా ప్రస్తుతం ఆడుతున్న న్యూజీలాండ్ జట్టు ఐదో రోజు మొత్తం ఆడి.. టీమ్ ఇండియా ముందు లక్ష్యాన్ని పెట్టాలి. అంతే కాకుండా చివరి రోజు భారత జట్టును ఆలౌట్ చేయాలి అప్పుడు కివీస్ గెలుస్తుంది. మిగిలిన ఆరు సెషన్లలో ఇలా జరగాలంటే వర్షం కురియకూడదు అంతే కాకుండా వెలుతురు సమస్య కూడా ఉండొద్దు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు అంటున్నారు.

తగ్గిన టికెట్ ధరలు..

కరోనా మహమ్మారి తర్వాత చాన్నాళ్లకు ఇంగ్లాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడు పోయాయి. వర్షం పడినా గత నాలుగు రోజులుగా అభిమానులు స్టేడియంకు వచ్చి హంగామా చేస్తున్నారు. కాగా, ఇప్పుడు మ్యాచ్ రిజర్వ్ డే రోజు కూడా జరిగే అవకాశం ఉండటంతో టికెట్ ధరలు తగ్గించాలని ఐసీసీ నిర్ణయించింది. గతంలో భారీగా ఉన్న ధరలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. రూ. 7722, రూ. 10296, రూ. 15444 చొప్పున టికెట్లు అమ్మడానికి నిర్ణయించింది. గతంలో డబ్ల్యూటీసీ ఫైనల్ టికెట్లు బ్లాక్‌లోనే రూ. 2 లక్షల వరకు పలికింది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ తేదీలు, వేదికను నిర్ణయించిన ఐసీసీపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. చాలా ముఖ్యమైన ఏకైక మ్యాచ్ ఆడాల్సి వస్తే ఇకపై దాన్ని యూకేలో మాత్రం నిర్వహించవద్దు.. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉన్నది అని మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానించాడు. ఈ ఒక్క మాట చాలు డబ్ల్యూటీసీ ఫైనల్ సజావుగా సాగకపోవడంపై ప్రతీ ఒక్కరు ఎంత కోపంగా ఉన్నారో. మరి మిగిలిన రెండు రోజులు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed