తెలంగాణ కరోనా బులెటిన్లలో అన్నీ తప్పులే..!

by Shyam |   ( Updated:2020-04-18 08:03:42.0  )
తెలంగాణ కరోనా బులెటిన్లలో అన్నీ తప్పులే..!
X

దిశ, న్యూస్ బ్యూరో: ”కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ‘లాక్‌డౌన్’ తప్ప మరో మార్గం లేదు. అందుకే ఈ నెల 30 వరకూ పొడిగిస్తున్నాం. ప్రజల ప్రాణాలకంటే ఆర్థిక వ్యవస్థ ముఖ్యమేమీ కాదు. ప్రజలు ‘ప్యానిక్’కు గురికావాల్సిన అవసరం లేదు” అని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ప్రజలు భయపడవద్దన్న ఉద్దేశంతోనే మీడియా కూడా అధికారిక గణాంకాలనే ప్రామాణికంగా తీసుకుంటూ ఉంది. ‘ఆఫ్ ది రికార్డ్’గా వచ్చిన సమాచారం వాస్తవమైనా బులెటిన్‌లో పేర్కొన్నవాటినే ప్రచురిస్తున్నాయి. ప్రసారం చేస్తున్నాయి. బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం బులెటిన్ల విషయంలో ఆ స్థాయిలో బాధ్యతతో వ్యవహరించడంలేదు. బులెటిన్లను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, కేరళ లాంటి రాష్ట్రాలు ఇస్తున్న బులెటిన్లతో పోలిస్తే తెలంగాణ పేర్కొంటున్న వివరాలు మొక్కుబడి మాత్రమే అనేది వాటిని చూస్తే స్పష్టమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం చెప్పే వివరాల్లో పారదర్శకత మచ్చుకైనా కనిపించదు.

ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కరోనా నిర్ధారణ కోసం ఎన్ని పరీక్షలు చేసింది, ఎంతమందికి చేసింది, నెగెటివ్‌గా తేలినవెన్ని, ఒక్కో లేబొరేటరీలో రోజుకు సగటున ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయి, ఎన్ని పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయి, ఏ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల కోసం ఎన్ని బెడ్‌లు ఉన్నాయి, అబ్జర్వేషన్‌లో ఎంతమంది ఉన్నారు… ఈ వివరాలేవీ బులెటిన్లలో కనిపించవు. కానీ ఈ వివరాలన్నీ ఇతర రాష్ట్రాల బులెటిన్లలో ప్రతీరోజూ అధికారులు పేర్కొంటూ ఉంటారు. ‘విషయాలను చెప్పటానికి మాకు భయమెందుకుంటుందండీ.. అంతా పారదర్శకంగానే ఉంటుంది’ అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వివిధ విషయాలకు సంబంధించి ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు కరోనా విషయంలో మాత్రం వాస్తవాలు ప్రతిబింబించడంలేదు. అంతా గోప్యమే. దీనికి తోడు లెక్కల్లో ప్రతీరోజు తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను ప్రభుత్వం కప్పిపుచ్చుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఒక్క బులెటిన్‌లో నాలుగైదు తప్పులు కనిపిస్తాయి. ఒక్కోరోజు ఈ తప్పులను సరిదిద్దుకోడానికి సవరణల పేరుతో అదనంగా మరో రెండు బులెటిన్లు విడుదలవుతాయి. లెక్కలు సరైనవే అయితే తప్పులు దొర్లడానికి అవకాశమే ఉండదు. అక్షర దోషమో లేక ‘టైపోగ్రఫికల్ ఎర్రర్’ అయితే మానవ సహజం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ జిల్లా కలెక్టర్లు అధికారికంగా చెప్పే వివరాలు రాష్ట్రస్థాయి బులెటిన్‌లో ప్రతిబింబించవు. ఆ లెక్కలేవీ ఇందులో చేరవు. అంతా గోప్యమే. ఉదాహరణకు 16, 17 తేదీల్లో వెలువడిన రెండు బులెటిన్లలోని తప్పులను పరిశీలిద్దాం.

1. ఈ నెల 16వ తేదీ రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో మెదక్ జిల్లాలో ఐదుగురు యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లు ఉన్నారని, ఒక్కరు కూడా డిశ్చార్జి కాలేదని పేర్కొన్నారు. కానీ మరుసటి రోజు (ఏప్రిల్ 17)న విడుదల చేసిన బులెటిన్‌లో మాత్రం ఆ జిల్లాలో ఇద్దరు యాక్టివ్ ఉన్నారని, ముగ్గురు డిశ్చార్జి అయినట్లు జిల్లాలవారీ టేబుల్‌లో పేర్కొన్నారు. కానీ ఒక్కరు కూడా డిశ్చార్జి కాలేదని ‘ఇన్ఫర్మేషన్’ అనే శీర్షిక కింద అదే బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇందులో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఏది నిజం?

2. 16వ తేదీ బులెటిన్‌ జిల్లాలవారీ టేబుల్‌లో జీహెచ్ఎంసీలో 134 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. కానీ 17వ తేదీ బులెటిన్‌లో మాత్రం 131 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. అంటే ముందురోజు డిశ్చార్జి అయినవారిలో ముగ్గురు మళ్ళీ ఆసుపత్రిలో చేరారనుకోవాలా? లేక ముందురోజు ఇచ్చిన బులెటిన్‌లో పొరపాటున 134 పడిందా? లేక 17వ తేదీ బులెటిన్‌లో పొరపాటున 134కు బదులుగా 131 పడిందా? ఈ రెండు బులెటిన్‌లలో ఆ శీర్షిక కింద జిల్లాలవారీ అంకెలను కూడితే మళ్ళీ ఎక్కడా పొరపాటు లేకుండా సరిగ్గా సరిపోయింది. అంటే ఉద్దేశపూర్వకంగానే అంకెలను తారుమారు చేసినట్లు స్పష్టమవుతోంది.

3. 16వ తేదీ బులెటిన్‌లో రాష్ట్రం మొత్తంమీద 700 మంది పాజిటివ్ పేషెంట్లు (డిశ్చార్జి అయినవారు, మృతిచెందినవారిని కలుపుకుని) ఉన్నట్లు పేర్కొన్నారు. మరుసటిరోజు బులెటిన్‌లో కొత్తగా 66 మంది పాజిటివ్ పేషెంట్లు చేరినందున ఆ సంఖ్య 766 అయినట్లు పేర్కొన్నారు. ఇంతవరకు సరిగ్గానే ఉంది. కానీ జిల్లాలవారీ వివరాల్లోకి వెళ్తే 16వ తేదీ గణాంకాలతో పోలిస్తే 17వ తేదీ బులెటిన్‌లో జీహెచ్ఎంసీలో 240 నుంచి 286కు (46 మంది కొత్త పాజిటివ్ కేసులు), వికారాబాద్‌లో 32 నుంచి 33కు (ఒకరు), జోగులాంబలో 18 నుంచి 19కి (ఒకరు), సూర్యాపేటలో 23 నుంచి 44కు (21) పెరిగినట్లు చూపించారు. అంటే ఈ నాలుగు జిల్లాల్లో 69 మంది పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ ఒక రోజు వ్యవధిలో 66 మంది మాత్రమే పెరిగినట్లు ‘ఇన్ఫర్మేషన్’ అనే శీర్షిక కింద చూపించారు. ఈ రెంటి మధ్య తేడా మూడు. ఈ ముగ్గురు పేషెంట్ల విషయంలో తేడా ఎందుకొచ్చింది?

4. ఈ రెండు రోజుల బులెటిన్లలో యాక్టివ్ కేసులు శీర్షిక కింద వచ్చిన తేడాను డిశ్చార్జి శీర్షిక కిందకు తీసుకెళ్ళడం ద్వారా ‘టోటల్’లో వచ్చిన కూడికకు సరిపెట్టారు. నిజానికి 17వ తేదీ బులెటిన్‌లో పేర్కొన్న వివరాలు సరైనవే అయితే యాక్టివ్, టోటల్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడు పెరుగుతుంది. డిశ్చార్జి అయినవారి వివరాల్లో మూడు తేడా రాదు. కానీ ఒక్క తప్పును సరిదిద్దుకోడానికి రెండు చోట్ల తప్పులు జరిగాయన్నది ఈ రెండు బులెటిన్‌లను చూస్తే అర్థమవుతుంది.

రెండు రోజుల బులెటిన్లను చూస్తేనే నాలుగు లోపాలు బైటపడ్డాయి. ఇక ప్రతీరోజు విడుదలచేసే బులెటిన్లను విశ్లేషిస్తే అంకెల మాయ లోతెంతో తెలుస్తుంది. ఈ నెల 4, 5 తేదీల్లో సైతం ఇదే తీరులో డిశ్చార్జి అయినవారు, చనిపోయినవారు, కొత్త కేసుల విషయంలో అంకెల్లో తప్పులు జరిగితే సవరణ పేరుతో అర్ధరాత్రి వరకూ సమయం తీసుకున్నారు. గతంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం (ఆర్టీసీ ఎండీ) సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం తప్పుల తడకగా ఉందని, లెక్కల్లో గందరగోళం ఉందని వ్యాఖ్యానించింది. దానికంటే ముందు కంటివెలుగు లెక్కలు సైతం ప్రతీరోజు విడుదల చేసిన బులెటిన్లలో కంటిపరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొన్న సంఖ్యలో భారీ తేడా వచ్చింది. దానికంటే ముందు ‘కాగ్’ ఆడిట్ రిపోర్టులో సాగునీటిపారుదల రంగానికి చేసిన ఖర్చు వివరాల్లో ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఇప్పుడు కరోనా వంతయింది.

వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య లేదా మృతుల సంఖ్యను ఎక్కువగా చూపెడితే ప్రజలు ‘ప్యానిక్’ అవుతారనేది ప్రభుత్వ ఉద్దేశమే కావచ్చు. కానీ వాస్తవాన్ని చెప్పడం ద్వారా ప్రజలు మరింత అప్రమత్తమై స్వీయ జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుంది. డాక్టర్లు, నర్సులు పీపీఈ కిట్లు లేవంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే.. పుష్కలంగా ఉన్నాయి, కొరత ఏమీ లేదంటూ సీఎం, ఆరోగ్య మంత్రి నొక్కిచెప్తున్నారు. కానీ ఇప్పటికీ రాష్ట్రం దగ్గర ఎన్ని కిట్లు ఉన్నాయో తెలియదు. నలభై వేలు ఉన్నాయంటూ సీఎం వ్యాఖ్యానించిన రోజు మంత్రి ఈటల రాజేందర్ ఐదు లక్షలు కొనుగోలు చేశాం అని లిఖితపూర్వకంగా చెప్పారు. సీఎం, మంత్రి మాటల్లో ఏది కరెక్టో వారిద్దరికే తెలియాలి.

అన్ని రాష్ట్రాలూ ప్రతీరోజు బులెటిన్లలో ఆ రోజు చేసిన పరీక్షలు, పాజిటివ్ ఎన్ని, నెగెటివ్ ఎన్ని, అబ్జర్వేషన్‌లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది పరీక్షలకు రిపోర్టులు రావాల్సి ఉంది, క్వారంటైన్‌లో ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎన్నిబెడ్‌లు ఉన్నాయి, ఎన్ని ఇంకా ఖాళీగా ఉన్నాయి, ఆక్సిజన్ మీద ఎంత మంది ఉన్నారు, ఎంత మందికి వెంటిలేటర్లు పెట్టారు, ఇంకా ఎన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.. ఇలా అన్ని వివరాలూ ఇస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వ విషయంలో మాత్రం ఇవేవీ ఇప్పటికీ తెలియదు. పారదర్శక పాలన అంటూ అంతా గోప్యంగానే ఉంచుతోంది. కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడంకంటే గందరగోళంలోకి నెట్టడానికే ఈ పరిస్థితులు దారితీస్తున్నాయి.

Tags: Telangana, Corona, Bulletin, Positive, Death, Discharge, Error, Wrong statistics

Advertisement

Next Story