ఇక ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది..

by Prasanna |   ( Updated:2021-03-18 04:30:11.0  )
ఇక ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థ కొవిడ్-19 సంక్షోభం నుంచి బయటపడిందని, ఇక మీదట పైకి ఎగబాకుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల ప్రభావం మొదలైందని, అయితే, ఇటీవల కరోనా వైరస్ తిరిగి పెరుగుతోందని, దానికోసం సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ‘ప్రభుత్వం ప్రకటించిన భారీ మూలధన వ్యయం ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులకు తోడ్పడుతుంది. ఇది ప్రైవేట్ పెట్టుబడులను పెంచేందుకు దోహదపడుతుంది. ఇప్పటి నుంచి ఆర్థికవ్యవస్థ ఒకే దిశలో ఉంటుంది. అది ముందుకే కదులుతుందని భావిస్తున్నట్టు’ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ కారణంగా ఆర్థిక పునరుద్ధరణ సవాళ్లను ఎదుర్కొంటుందని, అయితే ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలమనే నమ్మకం ఉందని దాస్ స్పష్టం చేశారు.

కేంద్రం, రాష్ట్రాలు తీసుకునే రుణాల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆర్‌బీఐ మార్కెట్‌కు మద్ధతు ఇస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 10.5 శాతంగా అంచనా వేసింది. ఇది ప్రభుత్వ అంచనా కంటే తక్కువగా ఉంది. గత నెలలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం 2020-21లో 8 శాతం చారిత్రాత్మక క్షీణత తర్వాత 2021-22కి 11 శాతం వృద్ధి సాధిస్తుందని కేంద్రం అంచనా వేసింది. బిట్‌కాయిన్ అంశంపై మాట్లాడిన దాస్.. ఆర్‌బీఐ వైఖరిని స్పష్టం చేస్తూ, బ్లాక్‌చైన్ సాంకేతికత వల్ల పలు సానుకూలత ఉన్నప్పటికీ, అదే సమయంలో ప్రతికూలత కూడా ఉంది. ఏదేమైనప్పటికీ బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ పట్ల సందేహాలున్నాయని దాస్ వెల్లడించారు.

Advertisement

Next Story