- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేగంగా కరుగుతున్న హిమానీనదాలు.. సంక్షోభానికి సంకేతమా!
దిశ, ఫీచర్స్: సగటు మానవుడి నుంచి భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తల వరకు అందరినీ ‘భూతాపం, వాతావరణ మార్పులు’ కలవరపరుస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇప్పటికే రుతువులు గతి తప్పడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వరదల బీభత్సం, మంచు ఖండాలు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగడం చూస్తేనే ఉన్నాం. శాస్త్రవేత్తల గత అధ్యయనాల ప్రకారం 2100 నాటికి సముద్ర మట్టాలు 3.6 అడుగుల మేర పెరుగుతాయని అంచనా. కాగా హిమానీనదాలు మునుపటి కంటే చాలా వేగంగా కరుగుతున్నాయని, దాదాపు 15 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే, సంవత్సరానికి 31 శాతం మేర ఎక్కువ మంచును కోల్పోతున్నట్లు ‘3డి శాటిలైట్ మెజర్‌మెంట్’ డేటా ద్వారా వెల్లడైంది. ప్రపంచంలోని అన్ని పర్వత హిమానీనదాలపై జరిగిన ఈ అధ్యయన ఫలితాలు ‘నేచర్’ సైన్స్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.
2000 – 2019 మధ్య ప్రపంచంలోని 2,20,000 హిమానీనదాల అధ్యయనం కోసం నాసా టెర్రా ఉపగ్రహం తీసిన అధిక రిజల్యూషన్ చిత్రాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజా అధ్యయనం కోసం ఉపయోగించుకుంది. ఈ మేరకు హిమానీనదాలు సంవత్సరానికి సగటున 267 బిలియన్ టన్నులు – 267 గిగాటన్ల మంచును కోల్పోయాయని వారు కనుగొన్నారు. 2000 సంవత్సరం ప్రారంభంలో సగటున 227 గిగాటన్ల మంచును కోల్పోతే, 2015 తర్వాత ప్రతీ ఏడాది సగటున 298 గిగాటన్ల వరకు కోల్పోయినట్లు అధ్యయనంలో తేలింది. దీని వల్ల ఏటా 0.74 మిల్లీమీటర్ల మేర సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అలస్కా, ఐస్లాండ్, ఆల్ప్స్, పామిర్ పర్వతాలు, హిమాలయాల్లో హిమానీనదాలు కరగడం ద్వారా సముద్రమట్టాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని పరిశోధకులు కనుగొన్నారు. హిమానీనదాలు మనకు ఇంపార్టెంట్ వాటర్ సోర్సెస్ కాగా వాటి క్షీణత.. తీవ్రమైన ఆహార, నీటి కొరతకు దారితీస్తుంది.
ఒకప్పుడు టిబెట్‌లోని హిమానీనదాలు అత్యంత స్థిరంగా ఉండేవని, ప్రస్తుత పరిస్థితుల్లో అవి కూడా కరగుతుండటం ఆందోళకరమైన విషయమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 3డీ ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి చేసిన తొలి అధ్యయనం ఇదే కాగా, గతంలో హిమానీనదాలలో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించడం ద్వారా లేదా కక్ష్య నుంచి గురుత్వాకర్షణ కొలతల ఆధారంగా హిమానీనదాల నష్టాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ ఆ రెండు పద్ధతుల కంటే ప్రస్తుతం అధ్యయనం కచ్చితత్వంతో కూడిన ఫలితాలను అందించిందని తెలిపారు. ప్రపంచంలోని సగం హిమనదీయ నష్టం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడాలోనే సంభవిస్తుండగా.. పదేళ్ల క్రితం హిమానీనదాలు వాతావరణ మార్పులకు సూచికగా భావించారు. కానీ ఇప్పుడు అవి వాతావరణ సంక్షోభానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ప్రపంచ హిమానీనద పర్యవేక్షణ సేవా డైరెక్టర్ మైఖేల్ జెంప్ అన్నారు.