పపువా న్యూగినియాలో హింస: 64 మంది మృతి

by samatah |
పపువా న్యూగినియాలో హింస: 64 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పపువా న్యూగినియా దేశంలో దారుణం చోటు చేసుకుంది. రెండు తెగల మధ్య జరిగిన కాల్పుల్లో 64 మంది మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని వాబాగ్ పట్టణంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే పాపువా న్యూ గినియాలోని ఎత్తైన ప్రాంతాల్లో 64 మృతదేహాలను గుర్తించారు. కాల్పులు ఇంకా జరుగుతున్నాయని, మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శాంసన్ కువా తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమ్తమయ్యారు. ఆ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. అయితే 64మంది ఒకే రోజు మరణించారా లేక అప్పుడప్పుడు చనిపోయారా అన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషాదంపై పపువా న్యూగినియా ప్రధాన మంత్రి జేమ్స్ మరాపే స్పందించారు. మరిన్ని బలగాలను పంపించాలని ఆదేశించారు.

సికిన్, అంబులిన్, కైకిన్ గిరిజనుల మధ్య ఘర్షణ!

ఈ దారుణ ఘటన సికిన్, అంబులిన్, కైకిన్ గిరిజనుల మధ్య జరిగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అనేక ఏళ్లుగా ఈ అల్లర్లు జరుగుతున్నప్పటికీ ఆయుధాల ఉపయోగంతో హింస పెరిగినట్టు తెలుస్తోంది. కాల్పులకు దుండగులు ఎస్ఎల్ఆర్, ఏకే-47, ఎం4, ఏఆర్15 రైఫిల్స్ ఉపయోగించినట్టు శాంసన్ కువా తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పపువా న్యూగినియా ప్రభుత్వం హింసను నియంత్రించడానికి అణచివేత, మధ్యవర్తిత్వం, క్షమాభిక్ష ఇతర ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలితాల నివ్వలేదు. కాగా, దేశ జనాభా 1980 నుంచి అధికంగా పెరిగింది. దీంతో భూమి, వనరులపై గిరిజనుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపపథ్యంలోనే అల్లర్లు జరుగుతున్నాయి.

Advertisement

Next Story