ఇటలీలో వెట్టిచాకిరి..33 మంది భారతీయులకు విముక్తి

by vinod kumar |
ఇటలీలో వెట్టిచాకిరి..33 మంది భారతీయులకు విముక్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటలీలో బానిసత్వంలో మగ్గుతున్న 33 మంది భారతీయులకు విముక్తి లభించింది. ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో భారతీయ వ్యవసాయ కార్మికులు అత్యంత దుర్బర పరిస్థితుల్లో పనిచేస్తుండగా వారిని గుర్తించి విముక్తి కల్పించినట్టు ఇటలీ పోలీసులు శనివారం తెలిపారు. ఇద్దరు వ్యక్తులు వీరిని మోసం చేసి ఇటలీకి తీసుకువచ్చినట్టు వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన నిందితులే కూలీలను సీజనల్ వర్క్ పర్మిట్‌లపై ఇటలీకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరికీ 17,000యూరోలు చెల్లిస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి తీసుకొచ్చారు. అనంతరం వారిని వ్యవసాయ భూముల్లో పనికి పెట్టి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ప్రతి రోజు సుమారు 12 గంటల పాటు పని చేయిస్తున్నారు.

అంతేగాక వారికి కేవలం గంటకు 4యూరోలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీనిని అత్యంత దారుణమైన బానిసత్వంగా పోలీసులు అభివర్ణించారు. అంతేగాక శాశ్వతంగా పని కావాలంటే మరో 13,000యూరోలు చెల్లించాలని, వాటి కోసం ఉచితంగా పని చేయాలని చెప్పినట్టు తెలిపారు. నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 5,00,000 యూరోలను స్వాధీనం చేసుకున్నారు.వారిపై కేసు నమోదు చేసి నోటీసులు అందజేయనున్నట్టు చెప్పారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో పండ్ల తోటల్లో పనిచేసే ఓ భారతీయ కార్మికుడు చేయి తెగిపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే యజమాని ఆయనను రోడ్డు మీదే విడిచిపెట్టి వెళ్లి పోవడం కలకలం రేపింది. ఆ టైంలోనే కార్మికుల దోపిడీ వెలుగులోకి వచ్చింది. దీనిపై దృష్టి సారించిన పోలీసులు కార్మికులకు విముక్తి కల్పించారు.

Advertisement

Next Story