US : రష్యాకు బాలిస్టిక్ మిస్సైళ్లు ఇచ్చారో కాచుకోండి.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్

by Hajipasha |
US : రష్యాకు బాలిస్టిక్ మిస్సైళ్లు ఇచ్చారో కాచుకోండి.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్‌కు మరోసారి అమెరికా వార్నింగ్ ఇచ్చింది. రష్యాకు బాలిస్టిక్ మిస్సైళ్ల సరఫరాను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌‌ను అగ్రరాజ్యం హెచ్చరించింది. సోమవారం విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రష్యాకు వందలాది బాలిస్టిక్ మిస్సైళ్లను అందించేందుకు ఇరాన్ ప్రణాళిక రచిస్తోందని, దీనిపై ఐరోపాదేశాలతో అమెరికా టచ్‌లోనే ఉందని ఆయన వెల్లడించారు. మిస్సైళ్లను రష్యాకు పంపే దుస్సాహసానికి ఇరాన్ తెగబడితే తమ నుంచి తీవ్ర స్పందనను చవిచూస్తుందని తేల్చి చెప్పారు.

ఇరాన్ మద్దతు వల్లే ఉక్రెయిన్‌పై భీకర దాడులతో రష్యా చెలరేగిపోతోందని వేదాంత్ పటేల్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగించేందుకు అవసరమైన సైనిక సామగ్రి కోసం అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా లాంటి దేశాలను రష్యా ఆశ్రయిస్తోందన్నారు. రష్యాకు డ్రోన్లు ఇవ్వడం లేదని ఇరాన్ బుకాయిస్తున్నప్పటికీ.. ఉక్రెయిన్‌లోని సామాన్య ప్రజలపై దాడులకు ఆ డ్రోన్లనే రష్యా వినియోగిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed