ఇజ్రాయెల్ దాడిలో హమాస్ టాప్ కమాండర్ మృతి: ధ్రువీకరించిన అమెరికా

by samatah |
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ టాప్ కమాండర్ మృతి: ధ్రువీకరించిన అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: గత వారం ఇజ్రాయెల్ చేసిన వైమాణిక దాడిలో హమాస్ అగ్ర కమాండర్ మార్వాన్ ఇస్సా హతమయ్యారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ ధ్రవీకరించారు. మార్చి 11న సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో ఇస్సా మరణించారని వెల్లడించారు. ఇంకా మిగిలిన అగ్రనేతలు సైతం సొరంగాల్లో దాక్కున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడానికి ఇస్సానే ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు. అయితే అమెరికా ప్రకటనపై హమాస్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు గాజాలోని ఆల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 20 మంది మరణించగా..200 మందిని అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

గాజా పరిస్థితులపై బైడెన్, నెతన్యాహు చర్చలు!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు సోమవారం ఫోన్‌లో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించినట్టు సమాచారం. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘గాజాకు వెళ్లే మానవతా సహాయం, బందీలను స్వదేశానికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలతో సహా ప్రధాన మంత్రి నెతన్యాహుతో బైడెన్ మాట్లాడారు. దీర్ఘకాలిక భద్రతను నిర్ధారించడం వంటి విషయాలను ప్రస్తావించారు’ అని పేర్కొంది. ఉత్తర గాజాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్టు తెలిపారు. గాజాలో అమాయక పౌరులు మరణించడం బాధాకరమని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed