అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్‌ బిల్లుకు ఆమోదం.. ఖండించిన చైనా

by Harish |
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్‌ బిల్లుకు ఆమోదం.. ఖండించిన చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాకు చెందినటువంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ నిషేధానికి సంబంధించిన బిల్లుకు బుధవారం అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 352 మంది ఓటు వేయగా, 65 మంది మాత్రం వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో దీనిపై గురువారం చైనా స్పందించింది. వాషింగ్టన్‌ది "బందిపోటు" మనస్తత్వం, విదేశాలలో ఉన్న తమ కంపెనీల ప్రయోజనాలను పరిరక్షించడానికి చైనా అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

మార్కెట్లో న్యాయమైన పోటీ సూత్రాలను అమెరికా గౌరవించాలి, విదేశీ కంపెనీలను అన్యాయంగా అణిచివేయడాన్ని ఆపాలని, అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి, అక్కడ పనిచేయడానికి న్యాయమైన, వివక్షత లేని వాతావరణాన్ని అందించాలని బీజింగ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హీ యాడోంగ్ గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని ఆయన చెప్పారు.

టిక్‌టాక్‌ చైనాలోని తన మాతృ సంస్థ బైట్‌‌డాన్స్ అధీనంలో ఉంది. ఈ కంపెనీ చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. బైట్‌‌డాన్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఆ పార్టీలో అత్యున్నత హోదాలో ఉన్నారు. అంటే పరోక్షంగా టిక్‌టాక్‌ను సీసీపీ నియంత్రిస్తోంది. టిక్‌టాక్‌ నుంచి బైట్‌‌డాన్స్ పూర్తి వాటాలను ఉపసంహరించుకుంటే, అమెరికాలో టిక్‌టాక్ తన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్ సభ్యుడు కృష్ణమూర్తి పేర్కొన్నారు. బిల్లు ఇంకా సెనేట్‌లో ఆమోదం పొందలేదు, చట్టంగా మారడానికి కొంత సమయం పడుతుంది.

Advertisement

Next Story

Most Viewed