విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తీయబోయిన ప్యాసింజర్

by Sathputhe Rajesh |
విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తీయబోయిన ప్యాసింజర్
X

దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో తరచూ వివాదాస్పద ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే వీరంగం సృష్టించాడు. అమెరికాకు చెందిన ఓ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్‌ని తెరిచేందుకు యత్నించాడు. వద్దని చెప్పిన సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు.

లాస్ ఏంజిల్స్ నుంచి బోస్టన్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం లాస్ ఏంజిల్స్ నుంచి బోస్టన్ బయల్దేరింది. విమానం 45 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా.. ఒక ఎమర్జెన్సీ డోర్ అన్ లాక్ అయినట్లు కాక్ పిట్‌లో అలారమ్ మెగడంతో అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు చేశారు. డోర్ లాకింగ్ హ్యాండిల్‌ను ఎవరో లాగినట్లు గుర్తించి సరిచేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఓ ప్యాసింజర్ ఈ విషయాన్ని గమనించాడు. ఓ వ్యక్తి డోర్ వద్ద కాసేపు ఉన్నాడని సిబ్బందికి తెలిపాడు. సదరు ప్రయాణికుడిని విషయం గురించి అడగ్గా సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. సిబ్బందిపైనే దాడికి దిగాడు. విమానం బోస్టన్‌లో ల్యాండ్ అవగానే విమాన సిబ్బంది ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని మసాచుసెట్స్‌కు చెందిన ఫ్రాన్సిస్కో టోరెస్‌గా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ హింసాత్మక ప్రవర్తనను తాము సహించబోమన్నారు. నిందితుడిని తమ ఎయిర్ లైన్స్ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed